బిడ్‌లను ఆహ్వానించిన వేదాంత
న్యూఢిల్లీ : తమిళనాడులోని తూతుకుడిలో స్టెర్లైట్ కాపర్ ప్లాంట్ విక్రయించేందుకు అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత బిడ్‌లను ఆహ్వానించింది. జూలై 4వ తేదీ బిడ్‌లను సమర్పించేందుకు ఆఖరి రోజుగా నిర్ణయించారు. యాక్సిస్ క్యాపిటల్‌తో కలిసి వేదాంత ఈ బిడ్‌లను ఆహ్వానించింది. 2018 మే నెలలో ప్లాంట్ విస్తరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో తూతుకుడిలో పోలీసులు కాల్పులు జరుపగా, 13 మంది మృతి చెందారు.
మరో 102 మంది గాయపడ్డారు. ఈ ఘటనతో ఈ ప్లాంట్‌ను మూసివేశారు. తూతుకుడి యూనిట్‌లో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు స్టెరిలైట్ కాపర్ ప్రకటించింది. ఈ ప్లాంట్ మూసివేయడం వల్ల దేశానికి 1.2 బిలియన్ డాలర్ల నష్టమేర్పడింది. ఇంకా ఈ యూనిట్‌ను మూసివేయడంతో 1.20 లక్షల మందిపై ప్రభావం పడింది కాపర్, సల్ఫరిక్ యాసిట్, ఫ్లోరోసిలిసిస్ యాసిడ్ వంటి ఉత్పత్తులపై ఆధారపడిన దాదాపు 400 ఎంఎస్‌ఎంఇలు కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్లాంట్ మూసివేత వల్ల వార్షికంగా సుమారు రూ.700 కోట్ల నష్టం ఏర్పడిందని అంచనా వేశారు. దేశంలోని కాపర్ డిమాండ్‌లో 40 శాతం వరకు ఈ ప్లాంట్ తీర్చేది.