Monday, December 23, 2024

అగ్ని రగిలేది ఏ పథంలో..?

- Advertisement -
- Advertisement -

అగ్నిపథ్ పథకాన్ని దాదాపుగా పోలిన షార్ట్ సర్వీస్ కమిషన్ కింద మిలిటరీ ఆఫీసర్ల నియామకాలను భారతీయ సైన్యం ప్రకటించినప్పుడు ప్రజల నుండి వ్యతిరేకత రాలేదు. దానికి కారణం పూర్తి స్థాయి ఆఫీసర్ నియామకాలతో పాటుగా అది కూడా ఒక ఆప్షన్ మాత్రమే కావడం. తర్వాత ఆ పథకంలో చాలా సానుకూల మార్పులు జరుగుతూ వచ్చాయి కూడా. మరి జవాన్ల కోసం పూర్తి స్థాయి నియామకాలకు అగ్నిపథ్‌ను ప్రవేశపెట్టవలసిన అగత్యం ప్రభుత్వానికి ఏం వచ్చింది, దాని వలన అగ్నివీరుల భవిష్యత్తు ఎలా ఉంటుందో విశ్లేషించుకోవాల్సిన సమయం ఇది.

Agneepath violence
భారతీయ సైన్యంలో రెజిమెంటల్ వ్యవస్థ ఉంటుంది. ఆర్మోర్డ్, ఆర్టిలరీ, ఇన్ఫాంట్రీ, మెకనైజ్డ్, కార్ప్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, కార్ప్ ఆఫ్ ఇంజినీరింగ్, ఆర్మీ ఏవియేషన్ కార్ప్, కార్ప్ ఆఫ్ సిగ్నల్స్. వీటిలో చాలా విభాగాలుంటాయి. డోగ్రా (జమ్మూలోని ఒక కులం) రెజిమెంట్, మద్రాస్ రెజిమెంట్ ఇలా ఒక ప్రత్యేక మతం, కులం, కమ్యూనిటీ, ప్రాంతం పేరుతో రెజిమెంట్‌లు ఉంటాయి. 80 శాతం సైన్యం రెజిమెంట్లలోనే ఉంటుంది. కేవలం రెజిమెంట్లు కాకుండా సైన్యానికి సేవలు అందించడానికి వివిధ కోర్‌లు ఉంటాయి. ఆర్మీ సప్లై కోర్ ఆహారాన్ని అందిస్తుంది, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ కోర్ వాహనాల రిపేర్లు చేస్తుంది. ఆర్మీ ఎడ్యుకేషన్ కోర్, జవాన్లు తమ ఉద్యోగ ప్రమోషన్లకు సంబంధించిన అంశాలను చూసుకుంటుంది. ఆర్మీ మెడికల్ కోర్ వైద్యాన్ని అందిస్తుంది. ఇటువంటివి ఆర్మీ సేవా కోర్‌లు.

సైన్యం మొత్తం సెంట్రల్ కమాండ్, నార్తర్న్ కమాండ్, సదరన్ కమాండ్, సౌత్ వెస్టర్న్ కమాండ్, వెస్టర్న్ కమాండ్, ట్రైనింగ్ కమాండ్ ఇలా ఏడు కమాండ్లుగా ఏర్పడి ఉంటుంది. వీటి కింద ఆర్మీ ఆఫీసర్లను ఎన్‌డిఎ విధానం తో రిక్రూట్ చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ర్యాలీలు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో జవాన్లను రిక్రూట్ చేసుకుంటారు. దీని ద్వారా రెజిమెంట్ లేక కోర్ ఎందులో ఆ సమయానికి ఖాళీలు ఉంటే దానికి నియామకాలు జరుగుతాయి. మన సైన్యంలో 1.4 మిలియన్ల యాక్టివ్ జవాన్లు, 2.1 మిలియన్ల రిజర్వ్ జవాన్లు, 1.3 పారా మిలిటరీ జవాన్లున్నారు. మొత్తం 1,129,900 యాక్టివ్ ట్రూప్‌లు, 960,000 రిజర్వ్ ట్రూప్‌లతో ప్రపంచంలోనే అతి పెద్ద సైన్యాలలో ఒకటిగా మన దేశం నిలబడింది.

దక్షిణాది కంటే ఉత్తరాది, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలా హిందీ మాతృభాషగా ఉండే ప్రాంతాల నుండి మిలిటరీలో జవాన్లుగా చేరతారు. చదువు అంతంత మాత్రం ఉండి పేదరికంలో ఉన్న కుటుంబాల యువతకు ఆర్మీలో లేదా పోలీస్‌లో చేరడం అతి పెద్ద లక్ష్యాలుగా ఉంటాయి. ప్రతి కుటుంబం నుంచి ఒక సైనికుడు ఉండే గ్రామాలు కోకొల్లలుగా ఉంటాయి. ఇంట్లో ఒకరు ప్రభుత్వోద్యోగంలో ఉండటంతో ఆ కుటుంబానికి స్థిర ఆదాయం, ఆర్థిక భద్రత ఏర్పడుతుంది. హిమాచల్‌ప్రదేశ్ అత్యధిక ఆర్మీ రిక్రూట్ మెంట్‌లు జరిగే రాష్ట్రం. వార్త్ వెస్ట్, వార్త్ ఈస్ట్ నుండి యువత పెద్ద సంఖ్యలో సైన్యంలో చేరతారు. ఉత్తరప్రదేశ్ 14.2 శాతం, రాజస్తాన్ 7-8 శాతం, మహారాష్ట్ర 7-8 శాతం, పంజాబ్ 7-8 శాతం, ఆంధ్రప్రదేశ్ 6 శాతం భారతీయ సైన్యానికి సైనికులను ఇస్తోంది.

ప్రస్తుత సగటు భారతీయ జవాను వయసు 32, 33 ఏళ్లు ఉండగా దాన్ని 28 ఏళ్లకు కుదించడం ప్రస్తుత పథకం అగ్నిపధ్ లక్ష్యం. అయితే వాస్తవానికి 17.5 నుండి 20 ఏళ్ల వయసు వరకు యువకులలో కౌమారమే వీడదు. శారీరక, మానసిక దారుఢ్యం సంతరించుకునేసరికి 25 ఏళ్లు వస్తాయి. అప్పటికి వారు 4 ఏళ్ల కాలపరిమితి ముగించుకుని ఇంటికి వెళ్లే సమయం వచ్చేస్తుంది. పోల్చి చూస్తే, ప్రస్తుతం సైన్యంలో ఉన్న జవాన్లు తమ కనీస 15 ఏళ్ల కాల పరిమితి ముగించేటప్పటికి ఇంకా యువతులుగానే ఉంటున్నారు. మైనస్ డిగ్రీల చలిలోనూ చేసే పిటిలు, ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి యుద్ధానికి సిద్ధం చేసే బిపిటి అనే ప్రత్యేక శిక్షణతో ఏర్పడిన శారీరక దారుఢ్యంతో, మంచి ఆరోగ్యంతో, వారు చురుకుగా ఉండటమే కాదు తమ ప్రాణాలకు తెగించి దేశం కోసం పోరాడాలన్న తపన కూడా అణువణువు నిండి ఉంటారు. సైన్యానికి సేవలు అందించడంలో వీరు ఏలోపం చూపనప్పుడు అగ్నిపథ్ లాంటి పథకాల అవసరమే లేదు. సైన్యం వయసు తగ్గించాలని నిర్ణయం ఒక సాకు మాత్రమే. దాని వెనక కేవలం రాజకీయ, ఆర్థిక కోణాలు మాత్రమే ఉన్నాయి.

2019-20 లెక్క ప్రకారం చూస్తే దేశం సైన్యం పై 4,48, 820 కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది. మన రక్షణ బడ్జెట్ 5.7 ట్రిలియన్లు. ప్రతి జవాను మీద ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు పెడుతుంది. పెన్షన్, జీవితకాలం మిలిటరీ హాస్పిటల్ సౌకర్యం, వారి పిల్లలకు చదువుల్లో కోటా, అంగవైకల్యం ఉన్న పిల్లలుంటే నెలకి 1000 రూపాయల గ్రాంట్, మాజీ సైనికుల పిల్లలు అనాథలుగా మారితే వారికి 21 ఏళ్లు వచ్చే వరకు నెలకి 2000 రూపాయల గ్రాంటు, పిల్లల విద్యకు, వితంతులకు ఆర్థిక సహాయం, మిలిటరీ క్యాంటీన్ సదుపాయం, కూతురి పెండ్లికి ఆర్థిక సహాయం, వితంతులకు వృత్తి విద్యా శిక్షణకి ఆర్థిక సహాయం, ఇంటి రుణానికి సబ్సిడీ, కొందరికి ప్రభుత్వ భూములను పంపిణీ ఇటువంటి ఎన్నో ఉపయోగాలు మాజీ సైనికులుగా పొందే వీలుంటుంది. అగ్నివీరుల నియామకంతో ఈ ఖర్చులు మిగులు.

సైన్యంలో చేరడాన్ని ఉద్యోగాలు పొందే మార్గంగా చూడకూడదు అని జనరల్ బిపిన్ రావత్ అంటున్నారు. అయితే చాలా మంది ఇది ఒక ఉద్యోగావకాశంగానే కాక వారి భావోద్వేగానికి చెందిన విషయంగా భావిస్తారు. భారత సైన్యంలో పని చేస్తున్నామన్నది యువతకు గర్వ కారణం. అంతేకాదు, ప్రభుత్వోద్యోగం అన్న నిశ్చింత ఉంటుంది. దాన్ని కాలరాచే ప్రథకం ఇది. నాలుగేళ్ల కాలపరిమితిలో వనరులు వెచ్చించి అగ్నివీరులకు ఆరు నెలలు ప్రాథమిక శిక్షణ, ఏడాది సాంకేతిక శిక్షణ ఇస్తారు. మిగిలిన రెండున్నర ఏళ్ల కాలంలో ముగిసిపోయే ఉద్యోగం మీద జవానుకు ప్రేమ ఎలా ఉంటుంది ప్రాణాలొడ్డి పోరాడదామనే తెగింపు వస్తుందా లేక బయటకు వెళ్లాక తన జీవితం ఎలా ఉంటుందో అనే భయంలో, నిరాశలో ఉంటాడా?

నాలుగేళ్ల తర్వాత 75 శాతం అగ్నివీరులు 11 లక్షల రూపాయలతో ఇంటి బాట పట్టినా బతుకుకు భరోసా నిచ్చే సుదీర్ఘ, సుస్థిర జీవనోపాధిని అందరూ పొందుతారని గ్యారంటీ ఏం లేదు. వాస్తవానికి ఆర్మీలో ప్రత్యేకించి నేర్చుకునే నైపుణ్యాలేవీ ఉండవు. అవి అక్కడ మాత్రమే పనికొచ్చే సామర్ధ్యాలు. బయటకు వచ్చి పోటీ ప్రపంచంలో పరుగెత్తలేరు. ఈ నాలుగేళ్ల కాలంలో బయటి ప్రపంచంలో వచ్చిన మార్పులకు అనుగు బంగా ఉండవలసిన నైపుణ్యాలు వీరికుండవు. మాజీ జనాన్లకు పారా మిలిటరీలో చేరే అవకాశం ముందు నుండి ఉన్నదే అయితే అందులో జీతాలు తక్కువ ఉంటాయి. సదుపాయాలు ఆర్మీతో పోలిస్తే తక్కువ అందుకే మాజీ సైనికులు కూడా అందులో చేరడానికి ఆసక్తి చూపించరు. ప్రభుత్వం చెబుతున్న విధంగా అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్ ఉన్నా అది సరిపోదు. నిరుద్యోగ సమస్యకు రూపుమాపడానికే ఈ పథకం అని చెప్పే కంటేతుడుపు ప్రక్రియనే అగ్నిపథ్. ఇటువంటి కాంట్రాక్టు ఉద్యోగాలు ఎప్పుడూ అభద్రతా వాభాన్నే నింపుతాయి.

సైన్యాన్ని కూడా కార్పొరేట్ చేసి సైనికులను కాంట్రాక్టు కూలీలుగా ఉపయోగించుకోనున్నట్లు కనిపిస్తోంది. దీని ప్రకారం 2032 కల్లా సైన్యంలో 50 శాతం అగ్నివీరులుంటారు. ఈ పథకం ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా సైన్యంలోని ఇతర కోర్‌ల మీద ప్రభావం చూపనుంది. దేశ వ్యాప్తంగా విస్తృతంగా జవాన్లకు సేవలందించే ఆర్మీ మెడికల్ కోర్‌లోని సిబ్బంది తగ్గిపోతారు. జవాన్లకు ప్రమోషన్లు, దానికి తగిన పరీక్షలు లాంటివి ఉండవు కాబట్టి ఆర్మీ ఎడ్యుకేషన్ కోర్ మూత పడుతుంది. ఆహారం అందించే సప్లై కోర్, ఇంకా భారతీయ సైన్యానికి లాజిస్టిక్స్ సమకూర్చే ఆర్డినెన్స్ ఇప్పటికే కొన్ని దేశాలలో ప్రైవేట్ పరం. ఇక ముందుకు మన దేశంలో కూడా జరిగేది ఇదే. ఈ విధంగానే ముందుకుపోతే జై జవాన్ నినాదమే చరిత్రగా మిగిలిపోవచ్చు.

శ్రీదేవి కవికొండల
7799821144

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News