Friday, December 20, 2024

గ్రూప్- 1 సక్సెస్ ప్లానర్

- Advertisement -
- Advertisement -

How to prepare TSPSC Group-1 exams

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పీఎస్సీ) ఇటీవల గ్రూప్ 1 ప్రిలిమ్స్‌తేదీని ప్రటించింది. ఈ పరీక్షకు అభ్యర్థులు ఎలా చదవాలి..? ఇప్పటి నుంచి ప్రిలిమినరీకి ఎలా సిద్ధమవ్వాలి. మరో పక్క మెయిన్స్ పరీక్షకు ఎలా ప్రిపేర్ కావాలి ? లక్షల్లో పోటీపడే ఈ పరీక్షలో మెరిట్ సాధించి సర్వీసు సాధించే మెళకువలు చూద్దాం..

గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు దశల్లో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా సిలబస్‌ను చూసుకోవాలి. ప్రిలిమినరీ టెస్ట్‌లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ కలిపి మొత్తం 150 మార్కులకు ఉంటుంది. సమయం రెండున్నర గంటలు, ప్రిలిమినరీలో క్వాలిఫై అయితే మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. అనంతరం మెయిన్స్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. మెయిన్స్‌లో జనరల్ ఇంగ్లిష్ అర్హత పరీక్ష మాత్రమే. దీనికి సమయం ౩ గం. ఉంటుంది. మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు.

మెయిన్స్ పరీక్షా విధానం:
మెయిన్స్ పరీక్షలో ప్రతీ పేపర్‌కు ౩ గం. సమయం ఉంటుంది. అలాగే ప్రతీ పేపర్‌కి 150 మార్కులు కేటాయిస్తారు. ఈ పరీక్షను మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు.

మెయిన్ పేపర్ 1 (జనరల్ ఎస్సే)
సమకాలిన సామాజిక అంశాలు
ఆర్థికాభివృద్ధి, న్యాయపరమైన సమస్యలు
శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి

పేపర్ 2 :హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ
భారత దేశ చరిత్ర, సంస్కృతి (1757 1947)
తెలంగాణ చరిత్ర, వారసత్వ సంపద
జాగ్రఫీ ఆఫ్ ఇండియా , తెలంగాణ

పేపర్ ౩ ఇండియన్ సొసైటీ, ఇండియన్ కానిస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్
భారతీయ సమాజం, నిర్మాణం, సామాజిక ఉద్యమం
భారత రాజ్యాంగం
పరి పాలన

పేపర్4: ఎకానమి అండ్ డెవలప్‌మెంట్
భారతీయ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
అభివృద్ధి, పర్యావరణ సమస్యలు

పేపర్ 5: సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్స్
శాస్త్ర, సాంకేతిక రంగాల పాత్ర, ప్రభావం
మోడరన్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్
డేటా ఇంటర్ ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్

పేపర్ 6: తెలంగాణ ఉద్యమ, రాష్ట్ర ఆవిర్భావం
ది ఐడియా ఆఫ్ తెలంగాణ (19481970)
మొబిలైజేషన్ ఫేజ్ (మద్ధతు కూడగడ్డే దశ 19711990)
తెలంగాణ ఏర్పాటు (19912014)

గమనిక: 900 మార్కులలో మెరిట్ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఈ సారి ఇంటర్వూ కూడా లేదు. సిలబస్ బాగా చదివి ప్రిపేరైతే చాలు విజయం సాధించడమే తరువాయి.

సిలబస్‌పై పట్టు:

విజయానికి దోహదపడే తొలి ప్రాధాన్యత అంశం సిలబస్ పరిశీలన అని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అభ్యర్థులు ముందుగా సిలబస్ మొత్తాన్ని పరిశీలించాలి. తర్వాత సిలబస్‌లో పేర్కొన్న అంశాల్లో బేసిక్స్‌పై పట్టు సాధించాలి. ఆయా అంశాల్లో అదనపు సమాచార సేకరణతో పాటు తాజా పరిణామాలపై దృష్టి సారించాలి. సిలబస్ ప్రకారం అందుబాటులో ఉన్న పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రిపరేషన్ దశ నుంచే వర్తమాన అంశాల్ని సిలబస్‌తో కలుపుకుంటూ అధ్యయనం చేయాలి.

ప్రిలిమ్స్‌తోపాటే మెయిన్స్ సన్నద్ధత:

ప్రిపరేషన్ మొదటి నుంచే మెయిన్స్‌పై కూడా దృష్టి సారించాలి. మెయిన్స్‌లో ఒక్కో ప్రశ్నకు 10 నుంచి 12 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది. ఆ కొద్ది సమయంలోనే ముఖ్యమైన సమాచారంతో సమాధానం రాసే నేర్పు సొంతం చేసుకోవాలి. మెయిన్స్ రాసే సమయంలో కొన్ని అంశాలకు ఫ్లో చార్ట్‌లు, డయాగ్రమ్స్ ఆధారంగా కూడా సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇంకా అభ్యర్థులు గుర్తించాల్సిన మరో ముఖ్య విషయం సమయపాలన. ప్రిపరేషన్ మొదటి రోజు నుంచి పరీక్ష రోజు వరకు ఈ సమయపాలన పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలి.

స్టేట్ మెంట్ ఆధారిత ప్రశ్నలే ఎక్కువ:
అభ్యర్థులు ప్రతి అంశాన్ని పూర్తిగా చదవాలి. అంతేకాకుండా ఆయా టాపిక్స్ సంపూర్ణ అవగాహన కోసం స్టేట్‌మెంట్ ఆధారిత ప్రిపరేషన్ కొనసాగించాలి. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్ష ఏదైనా స్టేట్‌మెంట్ ఆధారిత ప్రిపరేషన్ వల్ల సంబంధిత అంశంపై సమగ్ర అవగాహన వస్తుంది. ఈ విధంగా 3 లేదా 4 స్టేట్‌మెంట్స్ ఇచ్చి ఎ, బి లేదా బి,సి అని ఇస్తుంటారు. ఇది అభ్యర్థికి ఉన్న సమగ్ర అవగాహనను తెలుసుకోవడం కోసమేనని గుర్తించండి. ఒక టాపిక్ తీసుకుంటే దానికి సంబంధించి నిర్వచనం మొదలు తాజా పరిణామాల వరకు పూర్తి అవగాహనతో నోట్సు ప్రిపేర్ చేసుకోవాలి.
ఉదాహరణకు మానిటైజేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే .. అందులో ..
నల్లధనం నిర్వచనం ?
అది ఏ రూపంలో ఉంటుంది ?
ఆర్థిక, సామాజిక వ్యవస్థపై దాని ప్రభావం ?
డి మానిటైజేషన్ వల్ల నల్లధనం సమస్యకు ఎంత మేర పరిష్కారం లభిస్తుంది?
వాస్తవంగా ఇది సాధ్యమేనా?
ప్రస్తుత డి మానిటైజేషన్ వల్ల కలిగిన ఫలితాలు, తదనంతర పరిస్థితులపై అవగాహన.
ఈ విధంగా ఒక అంశాన్ని చదివితే ప్రశ్నలు ఎలా ఇచ్చినా సమాధానాలు రాయొచ్చు.

జనరల్ ఎస్సే:
సమకాలిన అంశాలు, ఆర్థికాభివృద్ధి, న్యాయపరమైన సమస్యలు ఇలా ముందు సిలబస్ చూసి వాటి రిలేటెడ్ ఎస్సే రోజు రాస్తు వాటిని కరెక్ట్ చేయించుకుంటూ ఇంప్రూవ్ అవ్వుతూ ఉండాలి. ఈ సమకాలిన అంశాల కోసం యోజన, కురుక్షేత్ర, ఎకనమిక్, పొలిటికల్ వీక్లీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైలీ, వీక్లీ మాస పత్రికలు చదవాలి.

ఎకానమీలో ఫ్యాక్ట్ బేస్డ్ కాన్పెప్ట్ ముఖ్యం:
ఎకానమీ పరంగా ఫ్యాక్ట్‌బేస్డ్ కాన్పెప్ట్‌పై అవగాహన పెంచుకోవాలి. తర్వాత విశ్లేషించుకుంటూ చదవాలి. అభ్యర్థులు సమయాన్ని పూర్తిగా గణాంకాలకే కేటాయించి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయని భావిస్తే సమయం వృధా అవుతుంది. ఆబ్జెక్టివ్ పరీక్షలో సైతం ఫ్యాక్ట్ ఆధారం చేసుకుంటూ విశ్లేషణాత్మకంగా సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలు ఎదురు అవుతాయి. ఎకానమిలో మౌలిక భావనల నుంచి తాజా పరిస్థితుల వరకు అధ్యయనం చేయాలి. జాతీయాదాయం, ప్రణాళికలు, జనాభా, బ్యాంకింగ్, ద్రవ్య విధానం, కోశ విధానం, పేదరికం నిర్మూలనా, నీతి అయోగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవాలి. సమ్మిళిత వృద్ధి, తాజా ఆర్థిక విధానాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.

జాగ్రఫీలో ప్రధాన్యత అంశాలే కీలకం:
ప్రత్యేకంగా ఒక పేపర్‌గా లేనప్పటికి ప్రిలిమ్స్, మెయిన్స్‌లో జాగ్రఫి సంబంధిత అంశాలు వస్తాయి. జాగ్రఫీపై పట్టు సాధించాలంటే అట్లాస్‌పై పరిపూర్ణ అవగాహన ఉండాలి. జాగ్రఫీలో అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ, భౌగోళిక అంశాలపై బేసిక్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు. అభ్యర్థులు సిలబస్ ప్రకారం ప్రాధాన్యత అంశాల జాబిత తయారు చేసుకుని ప్రిపేరయితే జాగ్రఫీలో మంచి మార్కులు సాధించే వీలుంది.

చరిత్ర అంటే రాజులు, యుద్ధాలే కాదు:
ముందుగా అభ్యర్థులు చరిత్ర అంటే రాజులు, యుద్ధాలు అనే పరిమితమైన దృక్పధాన్ని వీడాలి. దీనికి భిన్నంగా ఆయా రాజ వంశాల పాలన, పరిపాలనా ఫలితాలు, సంస్కృతి వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి ప్రధానంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో నాయకుల పాత్ర గురించి ఎక్కువగా చదవాలి.

సైన్స్ అండ్ టెక్నాలజీ:
బేసిక్ సైన్స్ టాపిక్ నుంచి లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ వరకూ అన్నింటిపైనా పట్టు సాధించేలా ప్రిపరేషన్ సాగించాలి. బేసిక్ సైన్స్ లో ప్రధానంగా సూత్రాలు, నిర్వచనాలు చదవాలి. బయలాజికల్ సైన్స్‌లో వ్యాధులు, వాటికి గల కారణాలు, వైరస్‌లు, బ్యాక్టీరియాలు వంటి టాపిక్స్ పై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు జికా వైరస్ దేనికి మూలం? వ్యాధి గ్రస్తుల లక్షణాలేంటి ? నివారణోపాయం, ఔషధాలు ? వాటికి సంబంధించి చేస్తున్న ప్రయోగాలు ఇలా అన్ని విషయాలపై అవగాహన అవసరం.

తెలంగాణ ఉద్యమంపై పత్యేకంగా:
తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేకంగా ఓ పేపరే ఉంది. నిజాంపాలన, హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం, ముల్కీ ఉద్యమం, దేశంలో విలీనం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పెద్దమనుషుల ఒప్పందం, వాటి అమలు..వైఫల్యాలు, 1948 తర్వాత సాయుధ పోరాటం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత, పోరాటాలు, తొలి, మలి దశ ఉద్యమాలు కీలకం. 1948 ముందు ఏం జరిగింది? 1969 ఉద్యమం? ఆ తర్వాత పరిస్థితితులతోపాటు తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.

ఇండియన్ పాలిటి ఇలా చదివితే ఈజీనే…:
గ్రూప్ 1లో కీలకమైన మరో విభాగం ఇండియన్ పాలిటీ ఈ విభాగంలో కోర్ సబ్జెక్టు, సమకాలి అంశాలను జోడించుకుంటూ చదవాలి. కోర్‌తో పాటు సమకాలిన అంశాలు కలుపుకుని 15 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అభ్యర్థులు భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు నుంచి రాజ్యాగ లక్షణాలు, రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు, రాష్ట్రపతి, గవర్నర్, మంత్రి మండలి, పార్లమెంట్, స్థానిక సంస్థలు వంటి ముఖ్యమైన టాపిక్స్‌తోపాటు పూర్తిగా సిలబస్‌పై అవగాహన పెంచుకోవాలి. రోజు ప్రిలిమ్స్ కోసమే కాకుండా మెయిన్స్ రాత పరీక్షకు సమయం కేటాయిస్తూ రోజు సమాధానాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ టాపిక్స్ అన్ని ఒకేసారి మెయిన్స్ స్థాయిలో ప్రిపేరవ్వాలి.

సొంత నోట్స్ తప్పనిసరి:
ప్రతి టాపిక్ చదివే సమయంలోనే సొంత నోట్స్ తయారీ చేసుకుంటే ఎగ్జామ్ ముందు రివిజన్ త్వరగా పూర్తవుతుంది. చదివిన వెంటనే సొంత నోట్స్ రాసుకొని ఎప్పటికప్పుడు రివిజన్ చేస్తూ ఉండాలి.

గ్రూప్ డిస్కషన్ :
ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు ఒక బృందంగా ఏర్పడి ఏదైనా టాపిక్ పై ప్రశ్నలు అడుగుతూ..సమాధానాలు చేప్పుకుంటూ గ్రూప్ డిస్కషన్ చేయవచ్చు. దీనివల్ల చాలా ఫాస్ట్‌గా రివిజన్ పూర్తవుతుంది. ఈ పద్ధతి వల్ల ఎక్కువ కాలం గుర్తుండిపోతాయి.

ప్రాక్టీస్ టెస్టులు:

ప్రిలిమ్స్, మెయిన్స్‌కి సిలబస్ అవ్వగానే ప్రాక్టీస్ టెస్ట్‌లు రాస్తూ ఉంటే అభ్యర్థులకు తమ ప్రిపరేషన్ స్థాయి తెలుస్తుంది. ప్రాక్టిస్ టెస్టులతో ఏ సబ్జెక్టులో వెనుక పడి ఉన్నారో తెలుస్తుంది. అప్పుడు అభ్యర్థులు ఏయే టాపిక్స్‌లో ఆన్సర్ చేయలేకపోయారో తెలుసుకుని తిరిగి పట్టు సాధించే వీలుంటుంది. అలాగే పాక్టీస్ టెస్టుల వల్ల సమయ పాలన అలవడుతుంది. జవాబులు రాసేటప్పుడు తగిన సమయంలోపే పూర్తి చేసేలా ప్రాక్టీస్ అవుతుంది.

డా.బిఎస్‌ఎన్ దుర్గా ప్రసాద్, డైరెక్టర్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News