దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు కఠిన నిర్ణయాలు అవసరం
మోడీ రాజకీయ ధైర్యం ప్రశంసనీయం
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ మద్దతు పలికారు. ఈ పథకాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దేశాన్ని అత్యంత సురక్షితంగా, పటిష్టంగా ఉంచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మోడీ ప్రదర్శిస్తున్న రాజకీయ ధైర్యం ప్రశంసనీయమని కొనియాడారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ధోవల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.అగ్నివీర్‌లను స్వల్పకాలిక వ్యవధిపై ఉద్యోగాల్లో తీసుకోవడంపై వ్యక్తమవుతున్న ఆందోళనలను అజిత్ తోసిపుచ్చారు. నాలుగేళ్లలో నేర్చుకున్న నైపుణ్యాలు, క్రమశిక్షణ కారణంగా అగ్నివీరుల భవిష్యత్తు నాలుగేళ్ల తర్వాత కూడా సురక్షితంగా ఉంటుందన్నారు.
‘మన యువత శారీరకదారుఢ్యం ఉన్నవారు. చురుకైన సైన్యం అవసరం. యువ జనాభా ఉన్న దేశం మనది. ఆ యువశక్తి ప్రభావం మన సాయుధ బలగాల్లోనూ ప్రతిబింబించాలి’ అని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక సురక్షిత, పటిష్ట భారతదేశం అనేది ఆయన ప్రాధాన్యతా క్రమాల్లో ఒకటని చెప్పారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా చెలరేగిన హింసాకాండంలో కొన్ని కోచింగ్ సెంటర్ల ప్రమేయం ఉందంటూ వస్తున్న ఆరోపణలపైనా ధోవల్ స్పందించారు. ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, నిందితులను గుర్తించారన్నారు. తగిన దర్యాప్తు అనంతరమే ఈ హింస వెనుక ఎవరున్నారనేది చెప్పగలుగుతామని ధోవల్ పేర్కొన్నారు.