అయిదో రోజూ ఇడి ముందుకు రాహుల్
రాత్రి 8 గంటలదాకా విరామం లేకుండా ప్రశ్నించిన అధికారులు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం అయిదోరోజు కూడా సుదీర్ఘంగా ప్రశ్నించారు. రాహుల్ గాంధీని అయిదు రోజులుగా ఇడి సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11.20 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఇడి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇడి కార్యాలయం చుట్టూ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అప్పటినుంచి రాత్రి 8 గంటల వరకు విరామం లేకుండా రాహుల్‌ను ప్రశ్నించిన అధికారులు ఆ తర్వాత అరగంట సేపు బ్రేక్ ఇచ్చి తిరిగి విచారణను కొనసాగించారు. కాగా రాహుల్‌ను ఇడి అధికారులు సోమవారం కూడా దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అంతకు ముందు గతవారం సోమవారంనుంచి బుధవారం దాకా వరసగా మూడు రోజులు 30 గంటల పాటు రాహుల్‌ను ఇడి అధికారులు ప్రశ్నించారు. దీంతో ఇప్పటివరకు ఆయనను 50 గంటలకు పైగా ప్రశ్నించినట్లయింది. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ ఇడి విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం కూడా ఆందోళనను కొనసాగించాయి.
ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంనుంచి జంతర్‌మంతర్ దాకా ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసి వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నందునే కేంద్రం తమ నేతను వేధిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పార్టీ ఎంపి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ ‘ అగ్నిపథ్’నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌తోసహా పలువురు కాంగ్రెస్ నాయకులు నిరసనలో పాల్గొన్నారు.
అనంతరం వారంతా ఎఐసిసి కార్యాలయం నుంచి జంతర్ మంతర్ వరకు ఊరేగింపు నిర్వహించడానికి ప్రయత్నించగా అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియచేయడానికి అనుమతి ఇచ్చామే తప్ప ఊరేగింపు నిర్వహించడానికి కాదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే బిజెపి అధికార ప్రతినిధి టామ్ వడక్కన్ కాంగ్రెస్ ఆరోపణలను ఖండించారు. అగ్నిపథ్‌కు ముందే రాహుల్ గాంధీని ఇడి విచారణకు పిలిచిందని, ఇప్పుడు దీన్ని కారణంగా చూపుతూ ఈ వ్యవహారాన్ని కప్పి పుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. సత్యాగ్రహం పేరిట నకిలీ గాంధీలు దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఇదిలా ఉండగా నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణుల ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఈ నెల 23న ఇడి ముందు విచారణకు హాజరు కావలసి ఉంది. కొవిడ్ అనంతర సమస్యలతో వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోనియా సోమవారం ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే.