న్యూఢిల్లీ: కొన్నేళ్ల క్రితం వరకు యోగా చిత్రాలు ఇళ్లకు, ఆధ్యాతిక కేంద్రాలకు పరిమితం అయ్యేవని, కానీ ఈరోజు ప్రపంచం నలుమూలల నుంచి అవి వస్తున్నాయని, ఇది అంతర్జాతయ యోగా దినోత్సవంపై ఉన్న ఉత్సాహాన్ని చూపిస్తోందని ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం పేర్కొన్నారు. యోగా ఏ ఒక్కవ్యక్తికో పరిమితం కాదని, యావత్ జాతి క్షేమానికని, అందువల్ల ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం లక్షం మానవ జాతి క్షేమానికి యోగా అని అభివర్ణించారు. మనకు మనం, మన ప్రపంచం గురించి మొదట తెలుసుకుంటే అవసరమైన విషయాలను తెలుసుకుని మనతోపాటు ప్రపంచం కూడా మారడానికి వీలవుతుందన్నారు. యోగాభ్యాస తరగతులు పార్లమెంట్ కాంప్లెక్సు, స్టేడియంలు, బీచ్‌లు, పార్కులు, ఆలయాల ప్రాంతాల్లోనూ మంగళవారం జరిగాయి. మైసూరులో వేలాది మందితో పాటు ప్రధాని మోడీ ఆసనాలు వేశారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ వద్ద యోగాసనాలు వేశారు. ప్రాచీన ఆరోగ్య క్రమశిక్షణ మానవజాతికి భారత్ ఇచ్చిన బహుమతిగా అభివర్ణించారు. గుజరాత్ కెవాడియాలో సమైక్యతా విగ్రహం వద్ద కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ యోగాసనాల్లో పాల్గొన్నారు. యోగా ప్రయోజనాలు ప్రజలకు వివరించారు.
దేశ పురోగతికి, ఆరోగ్యభారత్, ఆరోగ్యకర జాతి అవసరమన్నారు. ఢిల్లీ పౌరులు ప్రతి ఒక్కరూ రోజూ యోగా అభ్యాసం చేయాలని, పాఠశాలల్లో యోగాభ్యాస బోధన జరిగేలా చూస్తామని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద యోగాభ్యాస వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. జమ్ముకశ్మీర్, రాజస్థాన్‌ల్లో లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా యోగాసనాలు చేశారు. నాగాలాండ్‌లో కేంద్ర సహాయ మంత్రి కౌసల్ కిషోర్, రాష్ట్రమంత్రి పాంగ్‌న్యూఫోమ్, అధికారులు, భద్రతా సిబ్బంది, స్కూలు, కాలేజీ విద్యార్థులు యోగాభ్యాస వేడుకల్లో పాల్గొన్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో అదానీ శాంతిగ్రామ్ వద్ద బిలియనీర్ గౌతమ్ అదానీ, ఆయన భార్య ప్రీతి గంటసేపు యోగాసనాలు చేశారు. లండన్ లోని భారత హైకమిషన్ నియాస్డెన్ ఆలయంలో యోగా వారోత్సవాలు నిర్వహించారు. బ్రిటన్‌లో భారత దౌత్యవేత్తలు ఆరుబయలు యోగాసనాలు నిర్వహించారు. చైనా బీజింగ్‌లో భారత దౌత్య కార్యాలయం యోగా తరగతులు నిర్వహించింది. న్యూయార్క్, భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు జరిగాయి.
PM Modi Address at Mysuru on International Yoga Day