న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్‌ను నియమించినట్టు విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఆమె బాధ్యతలను చేపట్టనున్నట్టు పేర్కొంది. 1987 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి అయిన రుచితా ప్రస్తుతం భూటాన్‌లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. భూటాన్‌కు భారత మొదటి మహిళా రాయబారిగా రుచిరా నిలిచారు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేసిన టిఎస్ తిరుమూర్తి స్థానాన్ని కాంబోజ్ భర్తీ చేయనున్నారు. రుచితా కాంబోజ్ 1987 సివిల్ సర్వీస్ బ్యాచ్‌లో ఆల్ ఇండియా మహిళా టాపర్. అంతేకాదు 1987 ఫారిన్ సర్వీస్ బ్యాచ్‌లో టాపర్ కూడా. 2002-2005 వరకు న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత మిషన్‌లో కౌన్సెలర్‌గా ఆమె నియామకం పొందారు.
అక్కడ ఐరాస శాంతి పరిరక్షణకు , యూఎన్ భద్రతా మండలి సంస్కరణ మద్యప్రాచ్య సంక్షభం తదితర అంశాలపై పనిచేశారు. అనంతరం పలు పదవుల్లో సేవలందించిన ఆమె , ఇకపై ఐక్యరాజ్యసమితిలో భారత్ గళాన్ని వినిపించనున్నారు. ఇప్పటివరకు ఈ విధులు నిర్వహించిన తిరుమూర్తి ఐరాసలో భారత గళాన్ని స్పష్టంగా వినిపించారు. రష్యాపై ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో భారత్ వైఖరిని పలు దేశాలు తప్పుపట్టగా, ఆయా దేశాలకు దీటుగా బదులిచ్చారు. ఉక్రెయిన్ విషయంలో తామేం చేస్తున్నామో తమకు తెలుసని , తమకు ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని డచ్ రాయబారికి గట్టిగా సమాధానమిచ్చారు. ఐరాస విధానాలు, అంతర్జాతీయ చట్టాలను తాము పాటిస్తామని, అదే సమయంలో అన్ని దేశాల సార్వభౌమత్వం , భౌగోళిక సమగ్రతకు గౌరవమిస్తామని పేర్కొన్నారు.