కాబూల్ : అఫ్గానిస్థాన్‌లో బుధవారం తెల్లవారు జామున సంభవించిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. గంటల వ్యవధిలో మృతుల సంఖ్య వందల్లో పెరుగుతోంది. ఇప్పటివరకు 920 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిసంఖ్య 600 కి పైగా ఉంటుందని తెలిసింది. తూర్పు పక్షికా ప్రావిన్స్ లోని పలు ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించిందని అఫ్గాన్ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అఫ్గాన్ లోని ఖోస్ట్ నగరానికి 44 కిమీ దూరంలో 51 కిమీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది. భూకంప ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. అర్ధరాత్రి సమయంలో పలుమార్లు ప్రకంపనలు చోటు చేసుకోవడంతో అనేక మంది శిధిలాల కింద చిక్కుకుని మరణించినట్టు అధికారులు తెలిపారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిధిలాల కింద చిక్కుకున్నవారిని వెలికి తీసేందుకు రెస్కూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
పాక్ లోనూ ప్రకంపనలు
పాకిస్థాన్ లోనూ పలుచోట్ల ప్రకంపనలు సంభవించాయి. పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రావిన్స్‌ల్లో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం చోటుచేసుకోలేదని పాక్ అధికారులు తెలిపారు.