కశ్మీరులో భారీ వర్షాలు
జమ్మూ: జమ్మూ కశ్మీరులో భారీ వర్షాలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఒక వంతెనతోపాటు 150 అడుగుల రోడ్డు కొట్టుకుపోయాయి. రాంబన్, ఉధంపూర్ జిల్లాలలో కొండ చరియలు విరిగిపడుతుండడంతో రోడ్డు రవాణాకు వరుసగా రెండవరోజు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఉధంపూర్ జిల్లాలో తోల్డి నల్లా సమీపంలో జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై 150 అడుగుల రోడ్డు వరదల్లో కొట్టుకుపోయింది. జమ్మూ ప్రాంతంలోని పూంచ్, రాజోరి జిల్లాలను కలిపే మొఘల్ రోడ్డుపై కొండ చరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. తావీ నది పొంగి ప్రవేహిస్తుండడంతో అనేక చోట్ల వరదలు సంభవించి రహదారులు జలమయమైనట్లు అధికారులు తెలిపారు. రాంబన్, ఉధంపూర్ జిల్లాలలోని 270 కిలోమీటర్ల రహదారిపై 33 చోట్ల కొండచరియలు, మట్టిపెళ్లలు విరిగిపడిన సంఘటనలు చోటుచేసుకున్నట్లు అధికారులు చెప్పారు.