న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) బుధవారం (జూన్ 22) క్రిప్టోకరెన్సీల వంటి వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDAలు)ల పై మూలం వద్ద పన్ను కోత (TDS) నియమంపై వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎవరికైతే వర్తిస్తుందో వారికి పన్ను పడే విధానాన్ని వివరించింది. ఆర్థిక చట్టం 2022 ఇటీవల ఆదాయపు పన్ను చట్టం 1961లో సెక్షన్ 194ఎస్‌ను చేర్చింది. దీని ప్రకారం వర్చువల్ డిజిటల్ అసెట్స్(విడిఏల)పై జూలై 1 నుంచి ఏడాది కాలంలో రూ. 10,000 కి మించి లావాదేవీలు జరిగిన పక్షంలో 1శాతం మూలంలో పన్ను(టిడిఎస్) విధించనున్నారు. కొత్త నిబంధన అమలుకు ముందు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) జూన్ 21న ఫారమ్ 26QE, ఫారమ్ 16Eకి సంబంధించిన TDS రిటర్న్‌ల నియమాలలో కొన్ని సవరణలను ప్రకటించింది.
క్రిప్టో ఆస్తులపై ఆదాయపు పన్ను విధింపుకు సంబంధించి 2022-23 బడ్జెట్‌లో స్పష్టత వచ్చింది. ఏప్రిల్ 1 నుండి, గుర్రపు పందాలు లేదా ఇతర ఊహాజనిత లావాదేవీల నుండి వచ్చే లాభాలను పరిగణిస్తున్న విధంగానే క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30 శాతం ఆదాయపు పన్ను, ఇంకా సెస్, సర్‌ఛార్జ్‌లు విధించనున్నారు.
వర్చువల్ కరెన్సీలకు రూ. 10,000 కంటే ఎక్కువ చెల్లింపులపై 1 శాతం TDS ప్రవేశపెట్టబడింది. ఇది జూలై 1 నుండి ఇది ప్రారంభమవుతుంది. TDS యొక్క గరిష్ఠ పరిమితి(థ్రెషోల్డ్) నిర్దిష్ట వ్యక్తులకు సంవత్సరానికి రూ. 50,000 ఉంటుంది. దీని ప్రకారం వ్యక్తులు/HUFలు వారి ఖాతాలు I-T చట్టం కింద ఆడిట్ చేయించుకోవాల్సి ఉంటుంది.