‘మహా’ ప్రభుత్వం కూల్చివేతపై మమత
కోల్‌కత: మహారాష్ట్రలో ఎంవిఎ ప్రభుత్వాన్ని అనైతికంగా, రాజ్యాంగ విరుద్ధ పద్ధతిలో కూల్చడానికి బిజెపి ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్న తరుణంలోనే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని గురువారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఆరోపించారు. బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేయడం దురదృష్టకరమని, అనైతిక, రాజ్యాంగ విరుద్ధ పద్ధతిలో మహారాష్ట్రలోని శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కలయికలోని ఎంవిఎ ప్రభుత్వాన్ని కూల్చడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు. మహారాష్ట్రలో పరిణామాను దిగ్భ్రాంతికరంగా ఆమె అభివర్ణించారు. మహారాష్ట్ర ప్రజలకు, ఓటర్ల తీర్పునకు, ఉద్ధవ్ థాక్రేకు(మహారాష్ట్ర ముఖ్యమంత్రి) న్యాయం జరగాలన్నదే తమ అభిమతమని మమత అన్నారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను గువాహటికి ప్రత్యేక విమానంలో బిజెపి తరలించడానని ఆమె ప్రస్తావిస్తూ ఆ ఎమ్మెల్యేలను గువాహటి బదులు బెంగాల్‌కు బిజెపి పంపి ఉండాల్సిందని, తాము గొప్పగా అతిథి మర్యాదలు చేసి ఉండేవారమని మమత వ్యంగ్యాస్త్రాలు సంధించారు.