తైవాన్ ఫాక్స్‌కాన్
లవ్ ఆన్ ఇండియా
మోడీతో యంగ్‌లియూ భేటీ
ఇవిల దిశలో విస్తరణల స్పీడ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ రంగ దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియూ గురువారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తైవాన్‌కు చెందిన ఈ కంపెనీ ఇండియాలో ఎలక్ట్రానిక్ వాహనాలు(ఇవి) తయారీ కేంద్రం ఏర్పాట్లుకు యోచిస్తోంది. చైనా వెలుపల తన నిర్మాణ రంగ, సరఫరా క్రమాన్ని విస్తృతపర్చుకునేందుకు ఈ సంస్థ చాలా కాలంగా ప్రణాళికలు రూపొందించుకుంది. ఈ దిశలో సంస్థ ఛైర్మన్ లియూ ఇక్కడికి వచ్చారు. ప్రధానితో సంబంధిత విషయాలు మాట్లాడారు. భారత్‌లో సెమి కండక్టర్లు మొదలుకుని వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ విషయంలో ఫాక్స్‌కాన్ సంసిద్ధత వ్యక్తం చేయడం సంతోషకర పరిణామం అని ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. తమ భేటీ ఫోటోను జతపర్చారు. భారత్‌లో వారి విస్తరణ ఆలోచనలను స్వాగతిస్తున్నామని వివరించారు.
కాలుష్య నివారణకు నెట్ జీరో కార్బన్ ఉద్గారాల కట్టడికి అనుగుణంగానే ఈ సంస్థ ఇప్పుడు ముందుకు వస్తోంది. ఇవి తయారీ ప్రాధాన్యత కూడా ఇదే దిశలో ఉంటుందని ప్రధాని తెలిపారు. ఫాక్స్‌కార్‌కు చెందిన ఇవి తయారీ విభాగం ఫాక్స్‌ట్రాన్ ఇండియా, వియత్నాం, ఇండోనేషియాతో కూడిన ఆగ్నేయాసియాలో వివిధ ప్రాంతాలలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. భారతదేశంలో క్రమేపీ ఎలక్ట్రానిక్ కార్లు, ద్విచక్రవాహనాలు ఇతర శకటాల పట్ల పెరుగుతోన్న ఆసక్తిని గమనించి ఈ రంగంలో కూడా ఈ తైవాన్ సంస్థ విరివిగా పాలుపంచుకుంటుంది. ఐఫోన్లు, యాపిల్ ఫోన్ల తయారీలో ఈ కంపెనీ పేరు గడించింది. ఇప్పటికే ఈ కంపెనీకి ఇండియాలోని శ్రీపెరంబుదూరులో తయారీ కేంద్రం ఉంది. భారత్ ఎఫ్‌ఐహెచ్ పేరిట ఉన్న ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థకు చెందిన మరో ప్లాంటు నుంచి క్సియోమీ కోసం ఫోన్లు తయారు అవుతున్నాయి. మూడో ప్లాంటును తమిళనాడులో ఏర్పాటు చేయాలని, ఇక్కడ ఎలక్ట్రానిక్ వాహనాలను రూపొందించాలని సంస్థ తలపెట్టింది.
Foxconn Chairman Young Liu meets PM Modi