వింబుల్డన్ ఓపెన్‌లో మెరుగైన ఆటను కనబరుస్తాననే నమ్మకాన్ని స్పెయిన్ స్టార్ ఆటగాడు రఫెల్ నాదల్ వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించి నాదల్ జోరుమీదున్నాడు. ఇక తనకు అంతగా అచ్చిరాని వింబుల్డన్‌లో ఈసారి టైటిల్ సాధించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. దీని కోసం ముమ్మర సాధనలో నిమగ్నమయ్యాడు. ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌ను సాధించడంతో నాదల్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ విజయాలు అతనిలో కొత్త జోష్‌ను నింపాయనే చెప్పాలి. అయితే వింబుల్డన్‌లో నొవాక్ జకోవిచ్ (సెర్బియా) రూపంలో గట్టి ప్రత్యర్థి ఉన్న విషయం తెలిసిందే.
లండన్ : వింబుల్డన్‌లో నాదల్‌తో పోల్చితే జకోవిచ్‌కే మెరుగైన రికార్డు ఉంది. ఇది కూడా నాదల్‌కు కాస్త ప్రతికూల అంశంగా చెప్పక తప్పదు. అయితే నాదల్ మాత్రం టైటిల్ సాధించడమే లక్షంగా ముందుకు సాగుతున్నాడు. దీని కోసం సాధ్యమైనన్ని ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. స్విట్జర్లాండ్ ఆటగాడు స్టాన్ వావ్రింకాతో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ లో నాదల్ 62, 63 తేడాతో అలవోక విజయాన్ని అందుకున్నాడు. ఇక నాదల్ వింబుల్డన్‌లో చివరి 2019లో బరిలోకి దిగాడు. ఆ తర్వాత నాదల్ వింబుల్డన్‌లో ఆడడ ఇదే తొలిసారి. దీంతో అతను ఈ టోర్నీలో ఎలా ఆడతాడోనని అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు స్పెయిన్‌బుల్ నాదల్ మాత్రం మెరుగైన ప్రదర్శనతో తన ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జత చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.