ఇండోర్: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు లోయలో పడిన దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 47 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో బస్సు అదుపు తప్పి 50 అడుగుల లోయలో పడింది. ఇండోర్-ఖాండ్వా రహదారిపై వద్ద ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. బస్సు యజమాని గులాబ్ సోంకర్‌గా గుర్తించామని, బస్సు యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిస్థితిని పరిశీలించి, మృతుల కుటుంబీకులకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ప్రకటించారు. మధ్యప్రదేశ్ టూరిజం మంత్రి ఉషా ఠాకూర్, జలవనరుల శాఖ మంత్రి తులసీ సిలావత్ కూడా సంఘటన స్థలానికి పరిశీలించారు.