సెర్ప్-ఫ్లిప్‌కార్ట్ మధ్య ఒప్పందం
స్వయం సహాయక
మహిళా సంఘాల
ఉత్పత్తులకు
పాన్ ఇండియా మార్కెట్
ప్రపంచవ్యాప్తంగా
40కోట్ల ఫ్లిప్‌కార్ట్
వినియోగదారులతో
అనుసంధానం
ఈ ఏడాది
రూ.500 కోట్ల
వ్యాపారం లక్షం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో సువర్ణాధ్యాయం మొదలైంది. ఈవాణిజ్య రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ప్రముఖ ‘ఫ్లిప్‌కార్ట్ సంస్థ’తో కలిసి మన స్వయం సహాయక మహిళా సంఘాలు పనిచేయనున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఈ చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాయి. దీంతో మ హిళా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు ఇక దేశ, విదేశాల్లోనూ మార్కెటింగ్ సౌకర్యం లభించనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సంవత్సరంలోనే సుమారు రూ.500 కోట ్ల వ్యాపార లక్షంతో ఒప్పందం జరిగింది. సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు తగు ప్రోత్సహిస్తూ…. కొత్త వ్యాపార మెలకువలు నేర్పుతూ… సాధించడమే సిఎం కెసిఆర్ ప్రధాన లక్షం. అందుకు అనుగుణంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పని చేస్తున్న పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఒక అడుగు వేసి ఫ్లిప్‌కార్ట్ సంస్థతో ఒక ఎంఒయు చేసుకుంది.
దీంతో ఇప్పటి వరకు చేస్తున్న టోకు వర్తకాన్ని ఇకపై ఆన్ లైన్ ద్వారా నేరుగా వినియోగదారులకు అందజేయనుంది. ఈ నేపథ్యంలో సెర్ప్ సంస్థ మొదటి సారిగా రిటేల్ సామ్రాజ్యంలోకి దిగినట్లు అయింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సెర్ప్ అధికారులు, ఫ్లిప్ కార్ట్ ప్రతినిధుల మధ్య ఈ ఒప్పందం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, మహిళా సాధికారత అనేది కెసిఆర్ లక్షమన్నారు. తెలంగాణ సాధించిన విజయాల్లో ఇదొక విజయమని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలు తయారు చేసే వస్తువులకు ఆకర్షితమై ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల వినియోగదారులు ఉన్నఫ్లిక్ కార్ట్ అనే మల్టీ నేషనల్ ఆన్ లైన్ కంపెనీ ఒప్పందం చేసుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. మహిళా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులపై ప్రజల్లో ఉన్న విశ్వాసం…నమ్మకం కారణంగానే సదరు సంస్థ ముందుకు వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఫిప్‌కార్డు సంస్థకు ఎలాంటి మచ్చ రాకుండా…మన ఉత్పత్తుల నాణ్యతలో ఎలాంటి రాజీలేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తద్వారా ఇరు వర్గాలకు మార్కెటింగ్ పెరగండతో పాటు వ్యాపార వృద్ధి జరుగుతుందన్నారు. అలాగే వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు, సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయన్నారు.
మధ్యవర్తులు తగ్గిపోవడంతో లాభార్జన ఇరు సంస్థలకు దక్కుతుందన్నారు. అన్ని రకాల సీజనల్ పండ్లు, వ్యవసాయ ఉత్పత్తులను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు చేర్చాలన్నారు. మహిళా సంఘాలకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని గత ఏడాది రూ. 15వేల కోట్ల రుణాలు ఇస్తే, ఈ సారి రూ.18వేల కోట్లను రుణాలుగా ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. కనీసం గ్యారంటీ కూడా అడగకుండా బ్యాంకులు మన మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయన్నారు. ఇది మన మహిళా సంఘాలు సాధించిన విజయానికి సంకేతమని ఎర్రబెల్లి అన్నారు. అలాంటి సంఘాలు రాష్ట్రంలో ఉండటం, ఆ శాఖకు తానుమంత్రిగా ఉండటం గర్వంగా ఉందన్నారు. మహిళల వద్ద రికవరీ గ్యారంటీ 100 శాతం ఉంటుందన్నారు.
మహిళల్లో చైతన్యం పెరిగింది
మహిళల్లో మంచి చైతన్యం వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అన్ని రంగాల్లో వారు అద్భుతంగా రాణిస్తున్నారన్నారు. వ్యాపారంలో కూడా వారి చొరవ, శక్తి, శ్రమ బాగా ఉపయోగపడుతున్నాయన్నారు. మహిళల్లో ఇంత చైతన్యం రావడానికి కారణం మహిళా సంఘాలేనని అన్నారు. గ్రామాల్లో మహిళలు అంటే ఒక నమ్మకం పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో మహిళలు కూడా రుణాలు తీసుకొని ఇంటి అవసరాలు తీర్చుకోవడం కాకుండా వ్యాపారాలు చేయడానికి ప్రయత్నించాలన్నారు.
రాష్ట్రంలో పెనుమార్పులు
సిఎంగా కెసిఆర్ బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణలో పేనుమార్పులు జరిగాయన్నారు. ప్రధానంగా వ్యవసాయరంగానికి అవసరమైన నీరు…24 గంటల కరెంట్ వచ్చిందన్నారు. దీంతో దండుగలా ఉన్న వ్యవసాయం పండుగలా మారిందన్నారు. వ్యవసాయం… పరిశ్రమలు పచ్చబడడమే కాకుండా రాష్ట్రంలో సాగు దిగుబడి పెరిగిందన్నారు. ఫలితంగా దేశానినే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతోందన్నారు.
దేశానికే ఆదర్శంగా మారారు
మనకు మన మహిళలే ఆదర్శమని ఎర్రబెల్లి అన్నారు. మన రాష్ట్రంలో మహిళా సంఘాలు సాధిస్తున్న విజయాలు దేశానికే ఆదర్శంగా మారుతున్నాయన్నారు. ప్రధానంగా స్త్రీ నిధి బ్యాంకు విస్తరణ, స్వయం సహాయక సంఘాలు పనితీరు, మహిళా రైతు ఉత్పత్తి దారుల కంపెనీలు, వారు చేస్తున్న వ్యాపారాలు, కొత్తగా ఈ రంగంలోకి వస్తున్న ఔత్సాహిక వ్యాపారాలపై యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్నదని తెలిపారు.
అంతకుముందు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ, 30 ఏళ్ల మహిళా సంఘాల ప్రయాణం ప్రస్తుతం ఒక దారికి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 4.5 లక్షల గ్రూప్స్, 48 లక్షల సభ్యులు ఉన్నారు. రూ.18 వేల కోట్ల బ్యాంకర్లు ఇస్తున్న రుణాలు మహిళల దగ్గర పెట్టుబడులుగా ఉన్నాయి. ప్రతి ఏడాది స్త్రీ నిధి ద్వారా రూ. 2500 కోట్ల విలువైన బ్యాంక్‌ను తయారు చేసుకున్నారన్నారు. ప్రస్తుతం ఫ్లిప్ కార్డ్ ద్వారా పెద్ద మార్కెటింగ్ ప్లాట్ ఫామ్ లభిస్తున్నదన్నారు. మన వస్తువులను తిరిగి వినియోగదారులు కొనుగోలు చేయాలని…. తద్వారా ఒక బ్రాండ్ ఏర్పడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సిఒఒ రజిత, ఫ్లిప్ కార్ట్ గ్రోసరీ వైస్ ప్రెసిడెంట్ స్మృతి రవిచంద్రన్, డైరెక్టర్ శరత్ సిన్హా తదితరులు పాల్గొన్నారు.