హైదరాబాద్: హైదరాబాద్‌కు వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) రానుంది. విస్తీర్ణంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్దది కానుంది. దాదాపు 50-60 ఎకరాల్లో శంషాబాద్ విమానాశ్రయ సమీపంలో ‘డబ్ల్యూటీసీ శంషాబాద్’ను అభివృద్ధి చేయడానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ (డబ్ల్యూటీసీఏ) నుంచి గత ఏడాది చివర్లో కపిల్ గ్రూప్ లైసెన్స్ పొందింది. శంషాబాద్ డబ్ల్యూటీసీతో పాటు విశాఖలో కూడా మరోటి ఏర్పాటు చేయడానికి లైసెన్స్ పొందినట్లు కపిల్ కన్సల్టెన్సీ వైస్ ప్రెసిడెంట్, డబ్ల్యూటీసీ శంషాబాద్, విశాఖపట్నం వైస్ చైర్మన్ వై.వరప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ రెండు డబ్ల్యూటీసీలను కపిల్ గ్రూప్‌నకు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తోంది.
డబ్ల్యూటీసీఏ ప్రమాణాల ప్రకారం రెండు ప్రాజెక్టుల్లో దాదాపు 70-75 శాతం ఆఫీస్ మౌలిక సదుపాయాలు, 25-30 శాతం సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. హోటళ్లు, కో-లివింగ్ స్పేస్, కాన్ఫరెన్సింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ సదుపాయాలు, చిరుతిళ్ల ఔట్‌లెట్స్ అభివృద్ధి చేస్తారు. కాగా, ‘డబ్ల్యూటీసీ శంషాబాద్’లో బహుళ టవర్లు ఉంటాయని.. ఒక్కో టవర్‌లో 12 అంతస్తులను నిర్మిస్తున్నామని వరప్రసాద్‌రెడ్డి చెప్పారు. సమీపంలో విమానాశ్రయం ఉన్నందున శంషాబాద్ డబ్ల్యూటీసీ టవర్లు ఇతర వరల్డ్ ట్రేడ్ సెంటర్లతో పోలిస్తే తక్కువ ఎత్తులో టవర్లు ఉంటాయని పేర్కొన్నారు. మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలోని హార్డ్‌వేర్ పార్క్‌లో ‘డబ్ల్యూటీసీ శంషాబాద్’ను అభివృద్ధి చేస్తున్నారు.
ప్రస్తుతం 44 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ‘డబ్ల్యూటీసీ నోయిడా’ ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్. 43 ఎకరాలతో బీజింగ్‌లోని ట్రేడ్ సెంటర్ రెండో స్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ శంషాబాద్ మొదటి దశ 2025 నాటికి అందుబాటులోకి వస్తుంది. రూ.4 వేల కోట్లతో 40 లక్షల చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాను అభివృద్ధి చేస్తారు. 2035 నాటికి 80 లక్షల నుంచి కోటి చదరపు అడుగుల వరకూ పెంచుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ముందుగా రూ.1,000 కోట్లతో 10 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను, 225 గదుల హోటల్-కమ్-సర్వీస్డ్ అపార్ట్‌మెంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తారు. ఆ తర్వాత ప్రతి 10 లక్షల చదరపు అడుగుల అభివృద్ధికి అదనంగా రూ.500-1,000 కోట్లు ఖర్చవుతుందని వరప్రసాద్‌రెడ్డి తెలిపారు. డబ్ల్యూటీసీ శంషాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 15 ఎకరాలను ఇచ్చింది.