Friday, November 22, 2024

రాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్ర..?

- Advertisement -
- Advertisement -

Maharashtra Rebel went to Supreme Court

రంగంలోకి దిగిన గవర్నర్
రాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్ర?
షిండే శిబిరంలోకి మరో మంత్రి
అనర్హతపై సుప్రీంకోర్టు మెట్లెక్కిన రెబెల్స్
నేడు విచారణకు వచ్చే అవకాశం
15 మంది రెబెల్స్‌కు వైప్లస్ భద్రత
బుజ్జగింపు యత్నాల్లో థాక్రే సతీమణి

ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే శిబిరంలో చేరుతున్న ఎంఎల్‌ఎల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా, వారిపై చర్యలకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వర్గం పావులు కదుపుతూ ఉంది. 16 మంది తిరుగుబాటు ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాలని థాక్రే వర్గం డిప్యూటీ స్పీకర్‌ను కోరగా, తిరుగుబాటు వర్గం మాత్రం తమదే నిజమైన శివసేన అని వాదిస్తోంది. ఈ దశలో కరోనానుంచి కోలుకున్న గవర్నర్ పోలీసు శాఖతో సంప్రదింపులు జరుపుతుండడాన్ని బట్టి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పోలీసులు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆదేశాలను పాటిస్తున్నారు. మరో వైపు తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే వర్గంలో శివసేన ఎంఎల్‌ఎల సంఖ్య 39కి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరో మంత్రి ఉదయ్ సామంత్ ఆదివారం ఉదయం గౌహతికి చేరుకున్నారు. దీంతో థాక్రే మంత్రివర్గంలో 9 మంది మంత్రులు షిండే శిబిరంలో చేరినట్లు అయింది. మరో వైపు షిండే శిబిరంలోని రెబెల్స్‌లో దాదాపు 20 మంది ముఖ్యమంత్రి థాక్రేతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.
సుప్రీంకోర్టుకు రెబెల్స్
అనర్హత పిటిషన్‌పై ఈ నెల 27వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన నోటీసును న్యాయస్థానంలో సవాలు చేయాలని రెబెల్స్ నిర్ణయించారు. దీంతో పాటే శివసేన శాసన సభా పక్ష నేతగా అజయ్ చౌదరిని నియమించడాన్ని సవాలు చేస్తూ మరో పిటిషన్‌ను కూడా దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ వర్గం దాఖలు చేసిన రెండు పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై షిండే ఇప్పటికే న్యాయ సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. కోర్టు ఏం చెబుతుందో చూసిన తర్వాత రెండు మూడు రోజుల్లో షిండే శిబిరంలోని రెబెల్స్ అంతా కూడా గౌహతినుంచి ముంబయికి చేరుకోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనికి సంబంధించి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటికే రెబెల్ ఎంఎల్‌ఎల నివాసాలు, కార్యాలయాలపై శివ సేన కార్యకర్తలు దాడులు చేస్తున్న నేపథ్యంలో రెబెల్ ఎంఎల్‌ఎల కుటుంబాలకు భద్రత కల్పించాలని షిండే హోం కార్యదర్శికి, మహారాష్ట్ర హోం మంత్రికి లేఖలు రాసిన విషయం తెలిసిందే.
15 మంది రెబెల్స్‌కు‘ వై ప్లస్’ భద్రత
ఈ లేఖకు స్పందించిన కేంద్రం ఆదివారం 15 మంది రెబెల్ ఎంఎల్‌ఎలకు వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. అయితే భద్రత కల్పించిన వారిలో షిండే లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా దాదర్ ఎంఎల్‌ఎ సదా సావర్కార్ నివాసం వద్ద సిఆర్‌పిఎఫ్ బలగాలను కూడా మోహరించారు. అలాగే షిండే శిబిరంలోని ఎంఎల్‌ఎలందరి కార్యాలయాలకు పోలీసు భద్రత కల్పించారు.
పిరికి వాళ్లే పార్టీని వీడారు: ఆదిత్య థాక్రే

మరో వైపు శివసేన రెబెల్ ఎంఎల్‌ఎలపై ఉద్ధవ్ థాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్య థాక్రే విమర్శలు ఎక్కుబెట్టారు. కేవలం పిరికివాళ్లే పార్టీని విడిచి వెళ్లారన్న ఆయన రెబెల్ నేతలకు భద్రత కల్పించడమేమిటని ప్రశ్నించారు. కశ్మీరీ పండిట్లకు సిఆర్‌పిఎఫ్ భద్రత అవసరమని, గౌహతికి పారిపోయిన వాళ్లకు కాదంటూ షిండే శిబిరంపై విమర్శలు గుప్పించారు. వరసగా రెండో రోజే ముంబయిలోని శివసేన కార్యకర్తలతో మాట్లాడిన ఆదిత్య థాక్రే శివసేన గుర్తును, ప్రజల ప్రేమను రెబెల్ నేతలు తీసుకెళ్లలేరని అన్నారు. ‘మనం చేసినది తప్పని, ఉద్ధవ్ థాక్రే నాయకత్వానిది తప్పని భావిస్తే మనందరిదీ తప్పే. అటువంటప్పుడు పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయండి. అందుకు మేము సిద్ధమే’ అని ఆదిత్య థాక్రే అన్నారు. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా దాదాపుగా ఇదే విధంగా మాట్లాడారు.
రంగంలోకి ఉద్ధవ్ భార్య
మరో వైపు అసమ్మతి నేతలను బుజగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సతీమణి రష్మీ థాక్రే అసమ్మతి ఎంఎల్‌ఎల భార్యలతో మాట్లాడుతున్నారు. వారి భర్తలను ఎలాగైనా రాజీకి ఒప్పించాలని రష్మీ థాక్రే కోరుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉండగా అసోం మంత్రులు అశోక్ సింఘాల్, పిజుష్ హజారికాలు ఆదివారం గౌహతి హోటల్‌లో ఉన్న షిండే వర్గం ఎంఎల్‌ఎలతో భేటీ అయ్యారు.

Maharashtra Rebel went to Supreme Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News