Monday, December 23, 2024

బిజెపిది నై జవాన్… నై కిసాన్: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

Harish Rao comments on Modi govt

సిద్దిపేట: కొత్తపల్లి – మనోహరబాద్ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లు ఖర్చు చేశామని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. గజ్వేల్ రైల్వే స్టేషన్ లో ఎరువుల రేక్‌ పాయింట్‌ను మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.  తొలి విడతలో ఏపీలోని కాకినాడ ఎన్.ఎఫ్.సీ.ఎల్. నుంచి 21 బోగీలలో  1300 మెట్రిక్‌ టన్నుల ఎరువులు గజ్వేల్ కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు.  ర్యాక్ పాయింట్ ఉమ్మడి మెదక్ జిల్లాకు దశాబ్దాల పోరాటమని, గతంలో కెసిఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే లైన్ కోసం శాయశక్తుల కృషి చేశారని,  రైల్వే లైన్ ది కేంద్రం బాధ్యత అని, కానీ నేడు రైలు రావడానికి కేంద్రం నిధులు తక్కువ, రాష్ట్ర నిధులు ఎక్కువగా ఖర్చు చేశామన్నారు. అప్పటి ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య లు నిధులు ఇచ్చేవారు కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడో వంతుల ఖర్చులు  ఎప్పటికప్పుడు ఇచ్చామన్నారు. ఈ లైన్ కోసం 2200 ఎకరాల భూ సేకరణ చేశామని, ఈ రెక్ పాయింట్ జిల్లా ప్రజలకు వరంగా మారిందని ప్రశంసించారు.

రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామంటే, ఎక్కడికెళ్లి ఇస్తావు? అని నాటి కాంగ్రెస్ నేత జానారెడ్డి హేళనగా మాట్లాడారని, ఈ రోజు అది నిజమైందన్నారు. నీటి తీరువ రద్దు, పన్నులు రద్దు చేసిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని కొనియాడారు. రైతులకు నీళ్లు ఇచ్చామని, గోదాములు నిర్మించామని, చెరువులు బాగు చేశామని, ఎరువులు ఇస్తున్నామన్నారు. రేపటి నుంచి రైతులకు రైతుబందు 7500 కోట్లు ఖాతాల్లో పడుతున్నాయన్నారు. పక్క రాష్ట్రాల్లో మీటర్లు పెట్టి నిధులు తెచ్చుకున్నారని మండిపడ్డారు. బావిల దగ్గర మీటర్లు పెడుతామంటే మోడీ ప్రభుత్వాన్ని అడ్డుకున్నందుకు తెలంగాణ రావాల్సిన రూ. 25 వేల కోట్లు రాకుండా పోయాయన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల క్షేమమే ముఖ్యమన్నారు. తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక కేంద్రం నిధులు ఇవ్వడం లేదని హరీష్ రావు మండిపడ్డారు.

గతంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా జై జవాన్, జై కిసాన్ అనే వారు.. నేడు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం నై జవాన్, నై కిసాన్ అంటుందని ఎద్దేవా చేశారు. మొన్న నల్ల చట్టాలు తెచ్చి రైతుల ప్రాణాలు తీస్తే, నేడు ఆర్మీలో కాంట్రాక్ట్ సిస్టమ్ తెచ్చి యువకుల ఉసురు తీస్తున్నారని మోడీ ప్రభుత్వం విరుచుకపడ్డారు. తెలంగాణకు వచ్చి బిజెపి నేతలు ఏం చెబుతారన్నారు. నీతి ఆయోగ్ 24 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని చెప్పినా.. మోడీ ప్రభుత్వం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ కు మంజూరైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కు తరలించుకు పోయి తెలంగాణకు అన్యాయం చేస్తారా? అని మండిపడ్డారు. తెలంగాణ వచ్చే ఐటీఐఆర్ రద్దు చేశారని దుయ్యబట్టారు. వరి ధాన్యాలు కొనుగోలు చేయాలని అడిగితే నూకలు తినమని చెప్పి తెలంగాణ ప్రజలను అవమాన పరిచారని బిజెపి నాయకులపై ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చే లోపు వరి ధాన్యం ఎంత కొంటావో చెప్పి రావాలన్నారు.  కేంద్రం కొంటానన్న రా రాయిస్ కూడా తీసుకోకుండా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్ పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ లు ఫారూఖ్ హుస్సేన్, యాదవరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News