పాట్నా : ఓ కామాంధుడు కర్కశంగా అత్యాచారం చేస్తున్న సమయంలో బాధితురాలు శారీరకంగా నిరోధించక పోవడాన్ని ఆ దుశ్చర్యకు ఆమె అంగీకారం తెలిపినట్టుగా భావించకూడదని పాట్నా హైకోర్టు తెలిపింది. బాధితురాలి శరీరంపై గాయాలు లేకపోవడాన్ని బట్టి ఎటువంటి నిరోధం లేదని, ఇరువురి సమ్మతితో లైంగిక చర్య జరిగిందని చేసిన వాదనను జస్టిస్ ఎఎం బదర్ సింగిల్ జడ్జి బెంచ్ తోసిపుచ్చింది. బాధితురాలు వివాహిత అని, ఆమెకు సుమారు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడని, ఆమె సొంత ఇంటి లోనే ఆమెపై ఓ వ్యక్తి దాడి చేశాడని హైకోర్టు జూన్ 22న ఇచ్చిన తీర్పులో పేర్కొంది. ఇటువంటి పరిస్థితుల్లో నిందితుని చర్యను నిరోధించడం ఆమె కు సాధ్యం కాకపోవచ్చని పేర్కొంది. అంతేకాకుండా కేవలం నిరోధించనంత మాత్రాన సమ్మతి తెలిపినట్టుగా పరిగణించడం సాధ్యం కాదని వివరించింది. లైంగిక చర్యలో భాగస్వామ్యానికి ఇష్టాన్ని ప్రదర్శించే నిర్దంద్వ , బుద్ధిపూర్వక అంగీకారం రూపంలో సమ్మతి ఉండాలని భారత శిక్షాస్మృతి లోని సెక్షన్ 375 (అత్యాచారం) నిబంధన స్పష్టంగా చెబుతోందని తెలిపింది. నిందితుడిని దోషిగా ప్రకటిస్తూ 2017 మార్చి 9న సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అపీలును హైకోర్టు విచారించి ఈ తీర్పు చెప్పింది.