న్యూఢిల్లీ : దేశ సరిహద్దులో వాస్తవ నియంత్రణ రేఖకు పశ్చిమ ప్రాంతంలో 100 కిమీ పరిధిలో చైనా తన సాయుధ బలగాలను విస్తరింప చేయడమే కాక, రాకెట్ వ్యవస్థలను, వైమానిక రక్షణ వ్యవస్థలను నవీకరించింది. రన్‌వేలను విస్తరించింది. తూర్పు లడఖ్‌లో ప్రతిష్టంభన ఏర్పడిన నాటి నుంచి గత రెండేళ్లలో చైనా సరిహద్దులో తన బలగాలను, ఆయుధ వ్యవస్థలను విపరీతంగా పెంచుకుంటూ పోతోంది. వాస్తవ నియంత్రణ రేఖ పశ్చిమ భాగంలో 2020కు ముందు 20, 000 బలగాలు మాత్రమ ఉండగా, ఇప్పుడు 1.2 బిలియన్ బిల్లెట్ల వరకు సౌకర్యాలు, వసతులు పెరిగాయి. సౌర విద్యుత్ ప్లాంట్లు, చిన్నతరహా జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా చైనా ఏర్పాటు చేసుకుంది. శీతాకాలంలో తమ బలగాలు స్థిరంగా నెలకొని ఉండడానికి ఈ సదుపాయాలు తోడ్పడతాయని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి నమూనా గ్రామాలను కూడా నిర్మించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన నాలుగు డివిజన్లు జిన్‌జియాంగ్ మిలిటరీ జిల్లా విభాగం ఆధ్వర్యంలో తూర్పులడఖ్ ప్రాంతంలో పహరా కాస్తుంటాయి.