హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ఉజ్జల్ భూయాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరై, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మే 17న చేసిన సిఫారసును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల ఆమోదించగా గతవారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. అసోంకు చెందిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 2011 అక్టోబర్ 17న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు.
2019 అక్టోబర్ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ఆయన తండ్రి సుచేంద్రనాథ్ భూయాన్ సీనియర్ న్యాయవాది. అసోం అడ్వొకేట్ జనరల్‌గా కూడా పనిచేశారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 1964 ఆగస్టు 2న గువాహటీలో జన్మించారు. అక్కడి డాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య, కాటన్ కాలేజీలో ఇంటర్, ఢిల్లీలోని కిరోరి మాల్ కాలేజీలో డిగ్రీ చేశారు. గువాహటి ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బి, గువాహటి విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌ఎం చేశారు. 1991 మే 20న అసోం న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు.