మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి జిల్లాలో కోరుకొండ, పెదబయలు దళాలకు చెందిన 60మంది మావోయిస్టులు ఒకేసారి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 27 మంది మిలీషియా సభ్యులు కాగా మరో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలున్నారు. లొంగిపోయిన వారిలో మాజీ ఎంఎల్‌ఎలు కిడారి సర్వేశ్వరరావు, సోమ హత్య కేసు నిందితులు కూడా ఉన్నారు. భారీ సంఖ్యలో మావోలు లొంగిపోవడం గత పదేళ్ల కాలంలో ఇదే తొలిసారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. మావోయిస్టులు లొంగిపోవడంతో పాటు మరోవైపు మావోయిస్టుల డంప్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు డిఐజి హరికృష్ణ, ఎస్‌పి సతీశ్ మీడియాకు తెలిపారు. ఇందులో రూ.39 లక్షల నగదు, 9 ఎంఎం పిస్టల్, 2 ల్యాండ్ మైన్లు, బ్యాటరీలు, వైర్లు స్వాధీనం చేసుకున్నట్టు వారు వివరించారు.ఈ సందర్భంగా డిఐజి హరికృష్ణ మాట్లాడుతూ విశాఖపట్నం రేంజ్ పెదబయలు – కోరుకొండ ఏరియా కమిటీకు చెందిన 33 మంది పార్టీ మెంబర్లు , 27 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయారని తెలిపారు. విశాఖ రేంజ్ పరిధిలో కీలక నేత అరెస్టు తో పాటు పెద్దఎత్తున లొంగుపాటు చేయడంలో అల్లూరి సీతారమరాజు జిల్లా ఎస్‌పి సతీశ్, సిబ్బంది విశేషమైన కృషి చేశారన్నారు.
లొంగిపోయిన వారిలో మావోయిస్ట్ ప్రభావిత గ్రామాలు కొండ్రుo, తగ్గుపాడు, జుమడం, ననుబారి, జడిగుడ చెందిన వారున్నారని, వీరు మావోయిస్టు పార్టీ బెదిరిపులకు భయపడి మావోయిస్టు పార్టీలో చేరి పార్టీ మెంబర్లుగా, మిలీషియా సభ్యులుగా మందుపాతరలు పేల్చడం, దాడి చేయడం, యంత్రాలు, సెల్ టవర్లను తగలబెట్టడం, ప్రజాకోర్టులు నిర్వహించడం, హతమార్చడం వంటి అనేక నేరాలలో పాల్గొన్నారన్నారు. ముఖ్యంగా అనేక హింసాత్మక నేరాలలో చురుకుగా వ్యహరించిన మావోయిస్ట్ వంతల రామకృష్ణ లొంగిపోయాడని, అతనిపై 124 కేసులన్నాయని, గతంలో అరకు ఎంఎల్‌ఎ కిడారి సర్వేశ్వరరావు, అరకు మాజీ ఎంఎల్‌ఎ సివేరి సోమల హత్య కేసులోను పాల్గొన్నాడని తెలిపారు. ప్రభుత్వ పథకాల కారణంగా మావోయిస్టులు లొంగుబాటు జరిగిందని, మారుమూల ప్రాంతాలలో అభివృద్థికి ఆకర్షితులై మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని ఈ సందర్భంగా డిఐజి తెలిపారు.
60 Militia Members Surrendered in AP