లండన్: ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 35 ఏళ్ల వయసులోనే మోర్గాన్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం విశేషం. ఇంగ్లండ్‌కు వన్డే ప్రపంచకప్‌ను అందించిన ఘనత మోర్గాన్‌కు మాత్రమే దక్కుతోంది. కిందటి వన్డే వరల్డ్‌కప్‌లో మోర్గాన్ సారథ్యంలోనే ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. మోర్గాన్ ఆరంభంలో ఐర్లాండ్, ఆ తర్వాత ఇంగ్లండ్ తరఫున ఆడాడు. 2006లో ఐర్లాండ్ తరఫున మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టాడు. ఆడిన తొలి వన్డేలోనే 99 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఐర్లాండ్ తరఫున 23 వన్డేలు ఆడిన మోర్గాన్ 744 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2009లో ఇంగ్లండ్ జట్టుకు మారి పోయాడు. 2012 ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్‌లలోనూ ఆడాడు. అయితే తర్వాత కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమయ్యాడు. ఇక ఈ ఫార్మాట్‌లో మోర్గాన్ మెరుగైన ప్రదర్శనతో అలరించాడు. నిలకడైన ఆటను కనబరిచిన మోర్గాన్ ఈ ఫార్మాట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే అతని సారథ్యంలో ఇంగ్లండ్ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది.
అరుదైన ఘనత..
అయితే జట్టు వైఫల్యం చెందినా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మాత్రం మోర్గాన్‌పై పూర్తి విశ్వాసం ఉంచింది. 2019 వన్డే ప్రపంచకప్‌కు కూడా మోర్గాన్‌నే కెప్టెన్‌గా నియమించింది. అతని సారథ్యంలో ఇంగ్లండ్ అసాధారణ ఆటతో చెలరేగి పోయింది. మోర్గాన్ జట్టును ముందుండి నడిపించాడు. సొంత గడ్డపై జరిగిన టోర్నీలో ఇంగ్లండ్ అద్భుత ఆటను కనబరిచింది. ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా దిగిన ఇంగ్లండ్ అంచనాలకు తగినట్టుగానే ఆడుతూ ముందుకు సాగింది. ఇక ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. ఇలా ఎన్నో దశాబ్దాలుగా అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్ కలను సాకారం చేసిన కెప్టెన్‌గా మోర్గాన్ తన పేరును సార్ధకం చేసుకున్నాడు.
ఇక సుదీర్ఘ కెరీర్‌లో మోర్గాన్ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 248 వన్డేలు ఆడి 7701 పరుగులు చేశాడు. ఇందులో 14 శతకాలు మరో 47అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 115 టి20 మ్యాచ్‌లు ఆడిన 2,458 పరుగులు సాధించాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు 16 టెస్టులు ఆడి 700 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా 126 వన్డేల్లో ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన మోర్గాన్ 76 మ్యాచుల్లో జట్టును గెలిపించాడు. మోర్గాన్ సారథ్యంలో 72 టి20 మ్యాచులు ఆడిన ఇంగ్లండ్ 42 విజయాలు సాధించింది. ఇంగ్లండ్ తరఫున పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి మోర్గాన్ అరుదైన రికార్డును సాధించాడు. వన్డేలు, టి20లలో కలిపి 10,159 పరుగులు చేశాడు. మరోవైపు వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 17 సిక్సులు బాదిన ఏకైక ఆటగాడు మోర్గానే కావడం మరో విశేషం. అంతేగాక వన్డేల్లో రెండు దేశాల తరఫున సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్ కూడా మోర్గానే కావడం గమనార్హం.
Iyan Morgan retires from International Cricket