టి-హబ్ 2 ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కెసిఆర్
దేశానికే ఇది ఆదర్శం
యువతకు మార్గనిర్దేశం
ఆర్థిక వ్యవస్థకు ఊతం
తెలంగాణ స్టార్టప్
పాలసీ ఐటి కంపెనీలకు
అనుకూలం
ఏడేళ్లలో 2వ టి-హబ్
ప్రారంభించడం
గర్వకారణం
నూతన స్టార్టప్‌లు
దేశానికి, రాష్ట్రానికి
మంచి పేరు తేవాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిహబ్ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ స్టార్టప్ పాలసీ ఐటి కంపెనీల ఏర్పాటుకు అనుకూలం గా ఉందని సిఎం సగర్వంగా పేర్కొన్నారు. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో ఏర్పాటు చేసిన టి హబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్‌ను సిఎం కెసిఆర్ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ టి హబ్ స్థాపించాలన్న ఆలోచనకు ఎనిమిదేళ్ల క్రితమే అంకురార్పణ జరిగిందన్నారు. ప్రపంచంలో యువ భారత్ సామర్థ్యాన్ని తెలపాలని టి హబ్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. 2015 సంవత్సరంలో మొదటి దశ ప్రారంభించామని, ఏడేళ్ల తర్వాత టి హబ్ 2 దశ ప్రారంభించినందుకు గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఏడేళ్లల్లో టిహబ్ ద్వారా 1,200 స్టార్టప్‌లకు సహకారం అందించినట్లు ఆయన చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థకు ఈ స్టార్టప్‌లు దోహదం చేస్తాయని సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక టి హబ్ స్థాపనకు పెద్ద పీట వేశామని, హైదరాబాద్‌ను స్టార్టప్ క్యాపిటల్‌గా నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
యువ వ్యాపారవేత్తలను తయారు చేయడమే లక్ష్యం
దేశ యువతలో ఎంతో శక్తి దాగి ఉందని, యువ వ్యాపార వేత్తలను తయారు చేయడమే టి హబ్ లక్ష్యమని సిఎం తెలిపారు. 2015 టి హబ్, 2022 సంవత్సరంలో టి హబ్ 2 స్థాపించామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. దేశ భవష్యత్‌కు, యువతకు టి హబ్ మారదర్శకంగా ఉండబోతుందని సిఎం ప్రకటించారు. దేశంలో స్టార్ట్ అప్ ఆఫ్ స్టేట్‌గా తెలంగాణ తయారవుతుందని ఆయన జోస్యం చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికత, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దైనందిన జీవితంలో సామాన్యుల జీవన విధానాలు గుణాత్మకంగా పురోగమించేందుకు అంకుర సంస్థలు కృషి చేసేందుకు టిహబ్ దృష్టి సారించాలని సిఎం కెసిఆర్ సూచించారు. మౌలిక వసతుల పెంపునకు అధికారులు మరింతగా కృషి చేయాలని సిఎం అధికారులతో పేర్కొన్నారు. నూతన స్టార్టప్‌లు రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. మన స్టార్టప్‌లు ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాలకు తమ విలువైన సహకారాన్ని అందించడం గర్వించదగ్గ విషయమన్నారు.
కెటిఆర్, అధికారులను అభినందించిన సిఎం
అనంతరం ఆయన మూడో అంతస్థులో ఉన్న టిహబ్ -2 ప్రాంగణాన్ని పరిశీలించారు. టి హబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రత్యేకతలను అధికారులు సిఎం కెసిఆర్‌కు ఈ సందర్భంగా వివరించారు. పలు అంకుర సంస్థల ప్రతినిధులు, పలు రకాల కంపెనీల ప్రతినిధులు టిహబ్ కేంద్రంగా చర్చించు కోవడానికి ఏర్పాటు చేసిన మీటింగ్‌హాల్, వర్క్‌స్టేషన్‌లను సిఎం పరిశీలించారు. టిహబ్ ఇన్నోవేషన్ సెంటర్‌కు సంబంధించిన విషయాలను మంత్రి కెటిఆర్‌ను సిఎం అడిగి తెలుసుకున్నారు. టిహబ్‌కు 5 మార్గాల్లో వెళ్లేందుకు 100 నుంచి 120 అడుగుల రహదారులను నిర్మించామని అధికారులు తెలిపారు. మొదటి అంతస్థులో మొత్తం వెంచర్ కాపిటలిస్టుల కోసం కేటాయించామని మంత్రి కెటిఆర్ తెలిపారు. టిహబ్ భవనం చుట్టూ విస్తరించి ఉన్న ప్రముఖ కంపెనీలను సిఎం కలియతిరుగుతూ పరిశీలించారు. గేమింగ్, యానిమేషన్ సినిమాల్లో త్రీడి ఎఫెక్టుల వంటి రంగాల్లో కృషి చేస్తున్న సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తమ సేవలందిస్తున్నాయని మంత్రి కెటిఆర్ సిఎం కెసిఆర్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఐటి అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రి కెటిఆర్, ఐటి అధికారుల బృందాన్ని సిఎం కెసిఆర్ అభినందించారు.
పోలీసు శాఖ సాంకేతికతను మెరుగుపరుచుకోవాలి
పోలీసు శాఖలో సాంకేతికతను మరింతగా మెరుగుపరుచుకోవాలని డిజిపి మహేందర్‌రెడ్డికి సిఎం కెసిఆర్ సూచించారు. యూనికార్న్ వ్యవస్థాపకులు, ప్రముఖ అంకుర సంస్థలు ప్రతినిధులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కెటిఆర్, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్రెడ్డి, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేశంజన్, సైయింట్ వ్యవస్థాపక చైర్మన్ బివిఆర్ మోహన్‌రెడ్డి, టిహబ్ సిఈఓ శ్రీనివాస్ రావు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. టి హబ్ ప్రాంగణం మొత్తం ఐటి దిగ్గజాలు, అంకుర సంస్థలతో సందడిగా మారింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసిన కెటిఆర్‌కు అభినందనలు. టి హబ్ హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌ను ప్రోత్సహించడంలో విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్! -రతన్ టాటా
భారత్‌లోఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు మరింత బలం చేకూర్చేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ ఉపయోగపడుతుంది. టి హబ్2ను ప్రారంభించిన మిత్రుడు కెటిఆర్‌కు శుభాకాంక్షలు
-డా.ఆండ్రూప్లెమింగ్,టిఎస్‌యూకే హైకమిషనర్