కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ప్రకటన జారీ
న్యూఢిల్లీ : ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులపై దేశ వ్యాప్తంగా జులై 1 నుంచి నిషేధం అమలు లోకి రానున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ముఖ్యంగా తక్కువ పరిమాణం కలిగిన ఒకేసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను తయారు చేయడం, దిగుమతి చేసుకోవడం, నిల్వ ఉంచుకోవడం , సరఫరా, అమ్మకంతోపాటు వినియోగాన్ని కూడా పూర్తిగా నిషేధిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి నిషేధిత జాబితాలో ఏయే వస్తువులు ఉన్నాయో తెలియజేస్తూ, తాజాగా ప్రకటన జారీ చేసింది.
నిషేధిత జాబితాలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు ఇవే….
1.ఇయర్‌బడ్స్ 2.బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్ 3 ప్లాస్టిక్ జెండాలు 4.క్యాండీ స్టిక్స్ పిప్పరమెంట్లకు వాడే ప్లాస్టిక్ పుల్లలు 5.ఐస్‌క్రీమ్ పుల్లలు 6. అలంకరణ కోసం వాడే థర్మోకోల్ 7.ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులతోపాటు ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్క్‌లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు 8.వేడిపదార్ధాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్‌కు వాడే పల్చటి ప్లాస్టిక్ 9.ఆహ్వాన పత్రాలు 10 సిగరెట్ ప్యాకెట్లు 11. 100 మైక్రాన్ల లోపు ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు 12. ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు. ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఒకేసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను నిషేధాన్ని అమలు లోకి తెస్తున్నట్టు పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. పెట్రో కెమికల్ సంస్థలు కూడా ప్లాస్టిక్ ముడిసరకును వస్తువులను తయారు చేసే పరిశ్రమలకు సరఫరా చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఏ వాణిజ్య సంస్థా తమ పరిధిలో ఒకసారి వాడి పారేసే స్లాస్టిక్ ఉపయోగించ రాదని షరతు విధిస్తూ స్థానిక సంస్థలు లెసెన్సులు జారీ చేయాలని , ఒకవేళ ఎవరైనా ఉపయోగించినా, లేదంటే నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు విక్రయించినా వాటి లైసెన్సులు రద్దు చేయాలని స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్ నిషేధం సమర్ధంగా అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర పర్యావరణ , అటవీ మంత్రిత్వశాఖ తెలిపింది.