జిఎస్‌టి భారం తగ్గించాలని రాష్ట్ర మంత్రి హరీశ్ వినతి
స్వచ్ఛ పరికరాల కొనుగోళ్లను కనికరించాలి చిరునామాల వివాదాన్ని
పరిష్కరించాలి జిఎస్‌టి పరిధిని ఖరారు చేయాలి గజిబిజి
తొలగించాలి జిఎస్‌టి సమావేశంలో మంత్రి సూచనలు
మన తెలంగాణ / హైదరాబాద్ ః దేశంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల సర్వతోముఖాభివృద్ధికి జరుగుతున్న స్వచ్ఛ కార్యక్రమాలకు అవసరమైన పరికరాల కొనుగోళ్లల్లో జి.ఎస్.టి. భారాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇప్పటికే స్థానిక సంస్థలన్నీ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాయని, స్థానిక సంస్థలను కాపాడాలన్నా, వాటిని బలోపేతం చేయాలన్నా జి.ఎస్.టి. రూపంలో వసూలు చేస్తున్న పన్నుల శాతాన్ని గణనీయంగా తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ధికశాఖా మంత్రి టి.హరీష్‌రావు జిఎస్‌టి 47వ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. స్వఛ్ఛ పరికరాలకు సంబంధించి జి.ఎస్.టి. మినహాయింపుల జాబితాను మరింతగా విస్తరించాలని మంత్రి హరీష్‌రావు కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేకంగా డిమాండ్ చేశారు. మంత్రి టి.హరీష్‌రావు చేసిన సూచనలను సమావేశంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు కూడా సమర్ధించారు. ఈనెల 28, 29 తేదీల్లో ఛండీగఢ్‌లో జి.ఎస్.టి.47వ కౌన్సిల్ సమావేశం కేంద్ర ఆర్ధికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగింది. స్వచ్ఛ పరికరాల కొనుగోళ్ళపై పన్నుల భారాన్ని తగ్గించకపోతే స్థానిక సంస్థలు ఆర్ధికంగా ఇబ్బందుల్లో పడిపోతాయని మంత్రి హరీష్‌రావు కౌన్సిల్‌కు వివరించారు.
పన్నుల మినహాయింపు జాబితాను విస్తరించాలని, ఈ ప్రతిపాదనపై అధ్యయనం కోసం ఫిట్‌మెంట్ కమిటీకి పంపించి కొత్త ప్రతిపాదనలను రూపొందించాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మూలంగా నిర్ధిష్టమైన పన్ను చెల్లింపుదారులు కస్టమర్ చిరునామాలను అప్‌డేట్ చేయకపోవడం మూలంగా భారీగా ఆదాయం దారి మళ్ళుతోందని మంత్రి కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళారు. కొంతమంది పన్ను చెల్లింపుదారుల రికార్డుల్లోని కస్టమర్ చిరునామాలు తెలంగాణలోనే ఉన్నప్పటికీ వారి చిరునామాలను జి.ఎస్.టి.రికార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌గానే పరిగణనలో ఉన్నాయని, దాంతో తెలంగాణ రాష్ట్రం తరుపున నమోదు కావాల్సిన పన్నుల వసూళ్ళు ఆంధ్రప్రదేశ్ ఖాతాలోకి వెళుతున్నాయని, దీంతో జి.ఎస్.టి. పన్నుల వసూళ్ళ ఆదాయంలో కేంద్రం నుంచి తెలంగాణాకు రావాల్సిన వాటా నిధులపై ప్రభావం చూపుతోందని, ఈ సమస్యను కేంద్రమే పరిష్కరించాల్సి ఉందని, తెలంగాణకు న్యాయం చేయాలని మంత్రి హరీష్‌రావు కౌన్సిల్‌ను కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర ఆర్ధికశాఖామంత్రి 3బి ఫారంలో జి.ఎస్.టి.ఆర్. 3బి రిటర్న్‌లలో నెగెటివ్ వ్యాల్యూ (ప్రతికూల విలువ)లను అనుమతించాలని నిర్ణయం తీసుకోవడంతో కౌన్సిల్‌కు మంత్రి హరీష్‌రావు ధన్యవాదాలు తెలిపారు.
ప్రస్తుత 3బి రిటర్నుల్లో కూడా అదే సదుపాయాన్ని పొందుపరచాలని జీఎస్‌టి కౌన్సిల్ చైర్‌పర్సన్ కోరారు. తద్వారా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారుల చిరునామాల తప్పులను సరిదిద్దడానికి అవసకాశం ఏర్పడుతుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. దీంతో దారి మళ్ళిన ఐ.జి.ఎస్.టిని రికవరీ చేయడానికి, రాష్ట్రం వెలుపల ఉన్న పన్ను చెల్లింపుదారుల ట్యాక్స్ జ్యూరిసిడిక్షన్ విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల అధికారుల సహకారం కావాలని మంత్రి హరీష్‌రావు కౌన్సిల్ సమావేశంలో కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూశాఖ కార్యదర్శి జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక అధికారులతో సమావేశం నిర్వహించిన సమస్యలను పరిష్కరించాలని మంత్రి హరీష్‌రావు కోరారు. పన్ను చెల్లింపుదారులపై మళ్ళీ ఐ.జి.ఎస్.టి. చెల్లింపుతో భారం పడకుండా ఇప్పటికే చెల్లించిన పి.ఓ.ఎస్.తో ఐ.జి.ఎస్.టి.ని వాపసు చేయాలని మంత్రి హరీష్‌రావు కోరారు. జి.ఎస్.టి. అప్పిలేట్ ప్రతిపాదిత నిబంధనలు గజిబిజిగా ఉన్నాయని, ఆచరణాత్మకంగా లేవని మంత్రి హరీష్‌రావు చెప్పడంతో అందుకు కౌన్సిల్ చైర్‌పర్సన్ సైతం అంగీకరించారు.
అప్పిలేట్ నిబంధనలు, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుపై విధివిధానాలను తయారు చేసేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం (జి.ఓ.ఎం)కు అప్పగించారు. వచ్చే ఆగస్టు నెల ఒకటో తేదీలోగా ప్రతిపాదనలను సమర్పించాలని జి.ఓ.ఎం.ను జి.ఎస్.టి. కౌన్సిల్ చైర్‌పర్సన్ సూచించారు. ఇక క్యాసినోలు, గుర్రపు పందాలు, ఆన్‌లైన్ గేమింగ్‌లపైన జీ.ఓ.ఎం చేసిన ప్రతిపాదనలు, గోవా రాష్ట్ర అభ్యర్ధనలను దృష్టిలో ఉంచుకొని క్యాసినోవాలను జి.ఎస్.టి. పరిధిలోకి తెస్తూ కౌన్సిల్ సమావేశం ఆమోదించింది. ఇక గుర్రపు పందేల విషయంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండా ఆ ప్రతిపాదనలపై పునఃపరిశీలన జరపాలని మంత్రుల ఉపసంఘాన్ని కౌన్సిల్ సమావేశం కోరింది. దీనికి కౌన్సిల్ చైర్‌పర్సన్ కూడా అంగీకరించి గుర్రపు పందేలపై తుది నివేదికను జూలై 15వ తేదీలోగా ఇవ్వాలని జి.ఎస్.టి.చైర్‌పర్సన్ ఆదేశించారు.