2035 నాటికి భారత్‌లో పట్టణ జనాభా 67.5 కోట్లు
చైనా తర్వాత రెండో స్థానంలో భారత్
100 కోట్లు దాటనున్న చైనా పట్టణ జనాభా
ఐరాస నివేదిక అంచనా
ఐక్యరాజ్య సమితి: 2035లో భారత్‌లో పట్టణ జనాభా 67.5 కోట్లు(675 మిలియన్లు)గా ఉంటుందని వంద కోట్ల జనాభాతో చైనా ప్రథమ స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంటుందని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో పేర్కొంది. అంతేకాదు కొవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా పట్టణ జనాభా తిరిగి మామూలు స్థాయిలో పెరుగుతోందని, 2050 నాటికి మరో 220కోట్లు (2.2 బిలియన్లు) పెరగనుందని కూడా ఆ నివేదిక అంచనా వేసింది. కొవిడ్ మహమ్మారి కారణంగా శరవేగంగా పట్టణీకరణ తాత్కాలికంగా మాత్రమే ఆలస్యమైందని ‘ఐక్యరాజ్య సమితి హ్యాబిటట్స్’కు చెందిన ప్రపంచ నగరాల నివేదిక 2022 పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా పట్టణ జనాభా పెరుగుదల తిరిగి గతంలోలాగే వేగంగా పెరుగుతోందని 2050 నాటికి మరో 220కోట్లు పెరుగుతుందని ఆ నివేదిక అంచనా వేసింది. 2035 నాటికి భారత పట్టణ జనాభా 67,54,56,000కు చేరుకోవచ్చని ఆ నివేదిక అంచనా వేసింది. 2020లో దేశంలో పట్టణ జనాభా 48,30,99,000 ఉండగా, 2025 నాటికి అది 54,27,43,000కు, 2030నాటికి 60,73,42,000కు చేరుకుంటుందని ఆ నివేదిక అంచనా వేసింది. 2035 నాటికి భారత దేశంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి శాతం మొత్తం జనాభాలో 43.2 శాతంగా ఉంటుందని కూడా ఆ నివేదిక అంచనా వేసింది. కాగా 2035 నాటికి చైనా పట్టణ జనాభా 1000 కోట్లకు పైగా(1.05 బిలియన్లు) ఉంటుందని, ఆసియాలో పట్టణ జనాభా 2.99 బిలియన్లు, దక్షిణాసియాలో పట్టణ జనాభా 98,75,92,000గా ఉంటుందని తెలిపింది.
చైనా, భారత్ లాంటి భారీ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ జనాభాలో అధిక వాటా కలిగి ఉన్నారని, వాటి అభివృద్ధి పథాలు ప్రపంచ అసమానతలపై ఎక్కువగా ప్రభావాన్ని చూపుతున్నాయని ఆ నివేదిక పేర్కొంది. ఆసియా ఖండంలో గత రెండు దశాబ్దాల్లో చైనా, భారత్‌లలో శరవేగంగా ఆర్థికాభివృద్ధితో పాటుగా పట్టణీకరణ జరిగిందని, ఫలితంగా పేదరికంలో నివసించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆ నివేదిక పేర్కొంది. జననాల రేటు పెరుగుతున్నందున ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా తక్కువ ఆదాయ దేశాల్లో ఇప్పుడున్న పట్టణ జనాభాలు సహజంగానే మరింత పెరుగుతాయని, 2021లో 56 శాతం ఉన్న ఈ జనాభా 2050 నాటికి 68 శాతానికి చేరుకుంటుందని కూడా ఆ నివేదిక అంచనా వేసింది.కొవిడ్ మహమ్మారి ప్రారంభ దశలొ పెద్ద నగరాలనుంచి జనం గ్రామీణ ప్రాంతాలకు, చిన్న పట్టణాలకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లడం తాత్కాలిక స్పందన మాత్రమేనని, దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ దిశగా ప్రయాణంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని కూడా ఐరాస నివేదిక అభిప్రాయపడింది. ‘పట్టణీకరణ అనేది 21వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన ట్రెండ్‌గా ఉంటుంది’ అని ఐక్య రాజ్య సమితి అండర్ సెక్రటరీ, ఈ నివేదికను రూపొందించిన యుఎన్‌మ్యాబిటట్ ఎట్జిక్యూటివ్ డైరెకటర్ మైమునా మహమ్మద్ షరీఫ్ స్పష్టం చేశారు.
Indian Urban Population will reach to 67 crore by 2035