మనతెలంగాణ/ హైదరాబాద్ : పలు కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియామకం చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ ఫుడ్స్’ చైర్మన్ గా మేడే రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్‌లను నియామకం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మేడే రాజీవ్ సాగర్ ఫుడ్స్ ఛైర్మన్‌గా రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. మహిళా, శిశు, వికలాంగ, సీనియర్ సిటిజన్స్ విభాగం కింద తెలంగాణ ఫుడ్స్ కొనసాగుతున్నది.
మేడే రాజీవ్‌సాగర్..
మేడే రాజీవ్ సాగర్, తండ్రి కీ.శే.వినయ్‌సాగర్. విద్యార్హత – ఎమ్మెస్సీ కెమిస్ట్రీ. తెలంగాణ జాగృతి నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించారు. తెలంగాణ జాగృతిని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి తెలంగాణవాదాన్ని వినిపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో క్రైస్తవ సామాజిక వర్గ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యమ సమయంలో విద్యార్థులకు బాసటగా నిలిచి వారి అవసరాలు తీర్చారు. మిలియన్ మార్చ్, సాగరహారం కార్యక్రమాలకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేలాదిమందిని సమీకరించి కార్యక్రమాలను ఫలవంతం చేశారు. తెలంగాణ ప్రాచీన చరిత్రను వెలికితీసేందుకు కృషి చేస్తున్నారు. నల్లమల అడవుల పరిరక్షణ, చెంచుల హక్కుల పరిరక్షణకు ఉద్యమించారు.
మహ్మద్ ఖాజా ముజీబుద్దీన్
కామారెడ్డికి చెందిన మహ్మద్ ఖాజా ముజీబుద్దీన్, తండ్రి కీ.శే. ఖాజా మోయినుద్దీన్ 1968 జనవరి 30న జన్మించారు. బి.ఎ, ఎల్.ఎల్.బి వరకు చదువుకున్నారు. న్యాయవాదిగా పనిచేస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. టిఆర్‌ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. రెండు సార్లు మున్సిపల్ కౌన్సిలర్ గా, నిజామాబాద్ డిసిఎంఎస్ చైర్మన్‌గా కొనసాగారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో అనర్గళలంగా ఆయన మాట్లాడగలరు.
శ్రీదేవి మంత్రి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నారపల్లికి చెందిన మంత్రి శ్రీదేవి, తండ్రి మంత్రి శశిభూషన్ రావు, 1971 జనవరి 2న జన్మించారు. బిఎస్‌సి చదివారు. 2004 నుంచి టిఆర్‌ఎస్ నాయకురాలిగా కొనసాగుతున్నారు.