బాలికలదే పైచేయి.. 3007 స్కూళ్లలో 100% ఉత్తీర్ణత
ఒక్కరూ పాస్ కాని పాఠశాలలు 15, ఫలితాల్లో సిద్దిపేట ఫస్ట్
ఆగస్టు 1నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, టెన్త్ ఫలితాలు
విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మన : రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలలో బాలికలు పైచేయి సాధించారు. ఈ ఫలితాలలో మొత్తం ఉత్తీర్ణత 90 శాతం నమోదైంది. బాలికల ఉత్తీర్ణత 92.45 శాతం న మోదు కాగా, బాలుర ఉత్తీర్ణత 87.61 శాతంగా నమోదైంది. బాలికల ఉత్తీర్ణత, బాలుర కంటే 8.44 శాతం అధికంగా నమోదైంది. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పదవ తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, ఎస్‌ఎస్‌సి బోర్డు డైరెక్టర్ ఎ. కృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫెయిలైన విద్యార్థుల కోసం ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో పదవ తరగతిలో ఈసారి 70 శాతం సిలబస్ పరీక్షలు నిర్వహించామని, అలాగే 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కరోనా పరిస్థితులలో పదవ తరగతి విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల తీసుకున్న చొరవకు మంత్రి అభినందించారు. విద్యాసంవత్సరం నష్టపోకుండా విద్యార్థుల పట్ల అధికారులు, ఉపాధ్యాయులు తగిన ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. దూరదర్శన్, టీ సాట్ ద్వారా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడంతో పాటు ఉపాధ్యాయులు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి, విద్యార్థులను నిత్యం పర్యవేక్షించారని చెప్పారు.
టీచర్లు విద్యార్థుల ఇంటికీ వెళ్లి చెప్పారని అన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా మోడల్ ఎగ్జామ్స్ నిర్వహించారని గుర్తు చేశారు. పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఫెయిలైన విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం ఉంటుందని, అవసరమైతే విద్యార్థులు రాసిన పరీక్ష పేపర్ల జిరాక్స్ ఇస్తామని తెలిపారు. ఫెయిలైన విద్యార్థులకు వారానికి రెండుసార్లు అయినా ప్రత్యేక తరగతులు పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. ఉపాధ్యాయులు ఈ ప్రత్యేక తరగతులను భారం అనుకోవద్దని, బాధ్యతగా భావించాలని అన్నారు
సిద్దిపేట ఫస్ట్ .. హైదరాబాద్ లాస్ట్
టెన్త్ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 97.85 శాతం ఉత్తీర్ణతతో మొ దటి స్థానంలో నిలవగా,97.73 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ రెం డవ స్థానంలో 96.75 శాతం ఉత్తీర్ణతతో సంగారెడ్డి మూడో స్థా నంలో ఉన్నాయి. 79.63 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 3,007 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 15 స్కూళ్లలో ఒక్క రూ పాస్ కాలేదు. మే 23 నుంచి జూన్ 1 వరకు నిర్వహించిన పదవ తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,09,275 మంది హాజరయ్యారు.రెగ్యులర్‌లో 5,03,579 మంది విద్యార్థులకు 4,53,201 మంది(90 శాతం) ఉత్తీర్ణులు కాగా, ప్రైవేట్ 819 మంది విద్యార్థులకు 425 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్టిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి 10 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 18వ తేదీలోగా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని, 20వ తేదీన ప్రధానోపాధ్యాయులు ట్రెజరీ బ్యాంకుల్లో ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు.
పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు : 5,03,398
ఉత్తీర్ణత సాధించవారు : 4,53,201
ఉత్తీర్ణత శాతం : 90
పరీక్షలకు హాజరైన బాలికలు : 2,48,146
ఉత్తీర్ణత సాధించిన బాలికలు : 2,29,422
బాలికల ఉత్తీర్ణత శాతం : 92.45
పరీక్షలకు హాజరైన బాలురు : 2,23,779
ఉత్తీర్ణత సాధించిన బాలురు : 2,29,422