సంపాదకీయం: ‘మహారాష్ట్రలో అంతా సక్రమంగానే’ సాగిపోయిందా? ఏక్‌నాధ్ షిండే నాయకత్వంలోని శివసేన తిరుగుబాటు వర్గానికి చట్ట ప్రకారమే గుర్తిం పు గౌరవం లభించాయా? ‘మా ప్రభుత్వానికి కొందరి దిష్టి తగిలింది, ఆ దిష్టి ఎవరిదో అందరికీ తెలుసు, మావాళ్ళు పరాయివారయ్యారు” అంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పరాజితుని ఆవేదనతో అధికారం నుంచి వైదొలిగారు. ఆయన రాజీనామాకు గవర్నర్ కోశియార్ హుటాహుటిన ఆమోద ముద్ర వేశారు. 56 మంది ఎమ్‌ఎల్‌ఎల బలం కలిగిన శివసేనలో తిరుగుబాటు జరిగిన క్రమం దానికి సుప్రీంకోర్టు కూడా వెన్నుదన్నుగా నిలిచిన విధానం ఫిరాయింపుల ప్రోత్సాహక చాకచక్యాన్ని రక్తికట్టిం చాయి. ఈ నెల 21 తేదీ ఉదయం షిండే వర్గం ముంబై నుంచి సూరత్ వెళ్లి అక్కడి లీ మెరిడియన్ హోటల్‌లో బస చేసినప్పుడు ఆయనతో వున్నది 11 మంది ఎమ్‌ఎల్‌ఎ లేనని వార్తలు తెలియజేశాయి.
ఆ మరుసటి రోజు ఉదయం వారు గువాహతిలోని రేడిసన్ బ్లూ హోటల్ చేరుకున్నప్పటికి వారి సంఖ్య 32కి పెరిగింది, వారితోబాటు మరి ఏడుగురు ఇతర ఎమ్‌ఎల్‌ఎలు ఉన్నారు. ఆ రెండు చోట్ల అత్యంత విలాసవంతమైన అయిదు నక్షత్రాల హోటళ్లలో వారు బస చేశారు. ఆ పరిణామక్రమంలో షిండే బలం శివసేన శాసన సభాపక్షంలోని మూడింట రెండొంతుల బలానికి చేరుకొంది. ముంబై నుంచి శివ్‌సేన ఎమ్‌ఎల్‌ఎలు వొకరొకరుగా సూరత్, గువాహతిలకు వెళ్ళడానికి యేర్పాట్లు జరిగాయి. ఖరీదయిన హోటళ్లలో వారి విడిదికి, ఒక చోటి నుంచి మరో చోటికి ప్రయాణానికి యెన్ని లక్షలు, కోట్ల రూపాయల ఖర్చు అవసరమై ఉంటుందో ఊహించవచ్చు. దీనినంతా యెవరు భరించారు, యీ వ్యవహారాన్ని యింత పకడ్బందీగా వొక పథకం ప్రకారం నడిపించడం ఏక్‌నాధ్ షిండేకిగాని, ఆయన వర్గానికిగాని సాధ్యమయ్యే పని కాదు.
ఇదంతా కేంద్రంలో అధికారం లో గల బిజెపి పనేనన్నది ప్రత్యేకించి చెప్పనవసరం లేని వాస్తవం. ఇలా వొక పద్ధతి ప్రకారం క్రమక్రమంగా బలం పెంచుకొన్న ఏక్‌నాధ్ షిండే వర్గానికి సుప్రీంకోర్టు గట్టి రక్షణ కవచాన్ని తొడగడం అసలు సిసలయిన మెరుపు. తిరుగుబాటు ఎమ్‌ఎల్‌ఎల పాచికలు పారకుండా చేయడానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వర్గం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ను ఆశ్రయించింది. షిండే వర్గానికి చెందిన 16 మంది ఎమ్‌ఎల్‌ఎల సభ్యత్వం రద్దుకు సిఫారసు చేసింది. ఆ మేరకు వారికి శాసనసభ కార్యాలయం నోటీసులు పంపింది. దానిపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి సభ్యత్వా లపై జూలై 11వరకు డిప్యూటీ స్పీకర్ యెటువంటి నిర్ణయం తీసుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశించడం విస్మయం కలిగించింది.
ఫిరాయింపుల నిరోధక చట్టం స్పీకర్‌కు సర్వాధికారాలను దఖలు పరిచింది. స్పీకర్ తుది నిర్ణయం తీసుకొన్న తర్వాతే తప్ప మధ్యలో న్యాయస్థానాలు కలుగజేసుకోకూడదని సుప్రీంకోర్టే స్వయంగా తీర్పు ఇచ్చిన సందర్భాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం అది మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ యే నిర్ణయమూ తీసుకోకుండా ఆయన ముందరికాళ్లకు గట్టి బంధం వేసి తిరుగుబాటు వర్గానికి అపరిమితమయిన వీలు, వాలు కల్పించింది. అదే సుప్రీంకోర్టు మహారాష్ట్ర గవర్నర్ ఇచ్చిన బలపరీక్ష నోటీసుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఆ విధంగా కేంద్ర పాలకపక్ష కుతంత్రం నెగ్గడానికి, ఫిరాయింపుల కుట్ర ఫలించడానికి తోడ్పడిందనిపించుకొన్నది. ఇది న్యాయవ్యవస్థ, అత్యున్నత న్యాయస్థానం నిజాయితీ, నిష్పాక్షికతలపై మరకలా మిగిలిపోతుంది. గతంలో రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై సచిన్ పైలట్ వర్గం తిరుగుబాటు చేసినప్పుడు వారి సభ్యత్వాలపై నిర్ణయాన్ని ఆలస్యం చేయాలని స్పీకర్‌ను హైకోర్టు కోరగా దానిని సుప్రీంకోర్టు సమర్థించింది.
మహారాష్ట్ర అసెంబ్లీకి 2019లో జరిగిన యెన్నికల్లో బిజెపి, శివసేన కలిసి పోటీ చేశాయి. అస్పష్ట అసెంబ్లీ ఏర్పాటయింది. 103 మందితో బిజెపి అతిపెద్ద పార్టీగా వచ్చింది. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో విభేదాలు తలెత్తాయి. ముఖ్యమంత్రి పదవిని శివసేనకు విడిచిపెట్టడానికి బిజెపి నిరాకరించింది.దానితో శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌ల ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వాన్ని చివర వరకు బతకనీయకుండా రాజ్‌భవన్‌ను, న్యాయస్థానాలను, అధికారాన్ని బిజెపి దుర్వినియోగ పరచడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే.గతంలో కర్ణాటకలో కూడా బిజెపి యిదే పని చేసింది. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ అది అతిపెద్ద పార్టీగా రావడంతోనే గవర్నర్‌ను ఉపయోగించి బలపరీక్షకు ముందే యడ్యూరప్పను ముఖ్యమంత్రిని చేసి అభాసుపాలు అయింది. అప్పుడు ఏర్పడిన కాంగ్రెస్, జనతాదళ్‌ల ప్రభుత్వాన్ని కూడా పూర్తికాలం మననీయలేదు. భవిష్యత్తులో ఇటువంటి దుర్మార్గాలు జరగకుండా వుండాలంటే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కఠినతరం చేయాలి.