వయనాడ్‌లో రాహుల్ గాంధీ పర్యటన
వయనాడ్(కేరళ): కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ఇటీవల ధ్వంసం చేసిన తన ఎంపి కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించారు. అధికార సిపిఎం అనుబంధ విద్యార్థి విభాగమైన ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు జరిపిన ఈ దాడిని బాధ్యతారహిత చర్యగా రాహుల్ అభివర్ణించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఇక్కడకు వచ్చిన రాహుల్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో కలసి తన కార్యాలయాన్ని సందర్శించి జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఇది వయనాడ్ ప్రజల సొంత కార్యాలయమని, దీనిపై వామపక్ష విద్యార్థులు జరిపిన దాడి దురదృష్టకరమని ఆయన అన్నారు. హింస వల్ల సమస్యలకు పరిష్కారం లభించదని, తాను వారి పట్ల ఎటువంటి ఆగ్రహాన్ని లేదా శత్రు వైఖరిని ప్రదర్శించబోనని ఆయన చెప్పారు. దేశమంతటా ఇదే వైఖరి కనపడుతోందని, హింసతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఆలోచనలో కొందరు వెళుతున్నారని, కాని హింస వల్ల సమస్యలకు ఎటువంటి పరిష్కారం లభించబోదని ఆయన చెప్పారు.