Saturday, November 23, 2024

కాంగ్రెస్‌లో యశ్వంత్ సిన్హా టూర్ రచ్చ రచ్చ..

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌లో యశ్వంత్ సిన్హా టూర్ రచ్చ రచ్చ
ఎయిర్‌పోర్టుకు విహెచ్.. సిఎల్‌పిని తప్పుపట్టిన జగ్గారెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ టూర్ తెలంగాణ కాంగ్రెస్‌లో రచ్చకు కారణమైంది. ఆయనతో సమావేశమయ్యే విషయంలో టి కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడ్డాయి. జాతీయ స్థాయిలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు ఇతర ప్రతిపక్ష పార్టీలతో సహా కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌లు మంద్దతు పలికాయి. ఈ క్రమంలోనే యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పాల్గొన్నారు. ఇతర పక్షాలతో కలిసి ఆ కార్యక్రమంలో వేదిక పంచుకున్న వారు పలకరించుకున్న సందర్భం లేదు. అయితే తెలంగాణకు వచ్చేసరికి ఆ పరిణామాలు కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారాయి. కాంగ్రెస్, టిఆర్‌ఎస్ ఒక్కటేనని తెలంగాణ బిజెపి విమర్శలు మొదలుపెట్టింది.

ఈ క్రమంలోనే రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వస్తున్న యశ్వంత్‌సిన్హాతో భేటీపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే, పిసిసి మాత్రం యశ్వంత్ సిన్హాతో భేటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. అవసరమైతే ఢిల్లీ వెళ్లి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలపాలని పిసిసి ఆలోచన చేస్తుంది. పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సిన్హాకు మద్దతిస్తారని, అయితే టిఆర్‌ఎస్ నేతలతో ముందుగా భేటీ అవుతున్నందున హైదరాబాద్‌లో ఆయనను కలవబోమని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురువారం ప్రకటించారు. మమతా బెనర్జీ, శరద్ పవార్ నిర్ణయించిన అభ్యర్థి సిన్హా అని, కాంగ్రెస్ కాదని రేవంత్ అన్నారు. అయితే దీనిని పలువరు నాయకులు వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీ యశ్వంత్ సిన్హా బహిరంగంగా మద్దతు ఇచ్చిందని, అతను నామినేషన్ దాఖలు చేసినప్పుడు రాహుల్‌గాంధీ కూడా అతనితో చేరారని ఎత్తి చూపారు. దీంతో యశ్వంత్ సిన్హా హైదరాబాద్ టూర్ కాంగ్రెస్‌లో రచ్చకు కారణమైంది. నేడు హైదరాబాద్‌కు వచ్చిన యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్లారు.

మరోవైపు కాంగ్రెస్ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి కూడా బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యశ్వంత్ సిన్హాను కలవొద్దని పిసిసి చీఫ్ ప్రకటించారని చెప్పారు. యశ్వంత్ సిన్హాను సిఎల్‌పికి ఆహ్వానించాల్సి ఉండాల్సిందనని అన్నారు. ఇందుకోసం సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క అధిష్టానంతో మాట్లాడాల్సి ఉందన్నారు. భట్టి విక్రమార్క ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, సిఎల్‌పి తరపున యశ్వంత్ సిన్హాను ఆహ్వానించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు అందుబాటులో లేని టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. యశ్వంతసిన్హా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి రచ్చకెక్కినట్లైంది.

Congress away to Yashwant Sinha Hyderabad Tour

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News