సందర్శించనున్న యూపి సిఎం యోగిఆదిత్యనాథ్
హైదరాబాద్: పాతబస్తీలోని భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బిజేపి జాతీయ కార్యవర్గ సమావేశాలు గచ్చిబౌలిలోని హెచ్‌ఐసిసిలో శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. జాతీయ సమావేశాల్లో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ నగరానికి మద్యాహ్నం వచ్చారు. యూపి సిఎం భాగ్యలక్ష్మిఆలయాన్ని సందర్శించనున్నట్లు తెలియడంతో పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు. సౌత్‌జోన్ డిసిపి సాయిచైతన్య ఆధ్వర్యంలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల యోగి భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం ఆదివారానికి వాయిదాపడింది.
అయినా ముందస్తు చర్యల్లో భాగంగా చార్మినార్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలోనే టిఆర్‌ఎస్ నాయకులు చార్మినార్ వద్ద బైక్ ర్యాలీ నిర్వహించేందుకు యత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం కలుగుకుండా చర్యలు తీసుకున్నారు. కేంద్ర బలగాలు, హైదరాబాద్ సిటీ ఆర్మ్‌డ్ రిజర్వు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్, మఫ్టీ క్రైం పార్టీ తెలంగాణ పోలీస్ బెటాలియన్ బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.