Saturday, November 23, 2024

అఖిల ప్రపంచం ఆసక్తి

- Advertisement -
- Advertisement -

సోషల్ మీడియాలో హోరెత్తిన కెసిఆర్
ప్రసంగం లైవ్‌లో భారతీయులను
కట్టిపడేసిన ముఖ్యమంత్రి
కెసిఆర్ సంధించిన బాణాలపైనే చర్చ

మన తెలంగాణ / హైదరాబాద్ : దేశంలోనే కాకుండా ప్రపంచంలోని భారతీయులు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంపై దృష్టిసారించారు. హైదరాబాద్ నగరంలో ఏం జరుగుతోంది.. దేశ రాజకీయాలను, దేశ భవిష్యత్తుకు దిశాదశలను నిర్దేశించే అత్యంత కీలకమైన జాతీయస్థాయి రాజకీయ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కావడంతో భూగోళంలో ఉన్న భారతీయులు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ టీవీ ఛానెల్స్, యూ ట్యూబ్, సోషల్ మీడియాల్లో లైవ్ కవరేజీలను తిలకించారు. దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతాపార్టీ అట్టహాసంగా నిర్వహించుకొంటున్న జాతీయ కార్యవర్గ సమావేశాలు ఒకవైపు జరుగుతుండగా, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకడం దగ్గర్నుంచి నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్ వరకూ భారీ ఊరేగింపుగా తీసుకెళ్ళడం, అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హిందీలో అనర్గళంగా చేసిన ప్రసంగం ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేటట్లు చేసిందని యూట్యూట్ రికార్డయిన టీవీ ఛానెల్స్ హిట్స్, యూట్యూబ్ ఛానెల్స్, ఇంటర్నెట్‌లో తిలకించిన వారి సంఖ్య లక్షలల్లో ఉండటం గమనార్హం.

అంతేగాక ముఖ్యమంత్రి కెసిఆర్ స్పీచ్ వీడియో రికార్డులు కూడా లక్షల సంఖ్యలో వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సర్కులేట్ అవుతూనే ఉన్నాయి. కెసిఆర్ ప్రసంగం యావత్తూ హిందీ బాషలో ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ తిలకించడం శనివారం సోషల్ మీడియాలో హైలైట్‌గా నిలిచింది. అంతేగాక బి.జె.పి.జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇన్‌సైడ్‌గా జరుగుతుండటం, మీడియాకు అనేక రకాల ఆంక్షలు విధించడం, హెచ్.ఐ.సి.సి.వద్ద వలంటీర్ల ఓవర్‌యాక్షన్ మూలంగా కవరేజికి వెళ్లిన ఎంతో మంది రిపోర్టర్లు బిజేపి జాతీయవర్గ సమావేశాలను బయట నుంచే కవర్ చేయడం వంటి పరిణామాలు సోషల్ మీడియాను ఆకట్టుకోలేకపోయాయి. దానికితోడు బిజేపి అగ్రనేతల్లో ఒకరైన వసుంధరరాజే సింధియా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలు మాత్రమే మీడియా పాయింట్‌లో ప్రసంగించారే తప్ప ప్రధాని నరేంద్ర మోడీగానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాగానీ, బి.జె.పి.అధ్యక్షుడు జే.పి.నడ్డాలలో ఏ ఒక్కరూ శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ మీడియాతో మాట్లాడలేదు. దాంతో బి.జే.పి.జాతీయ కార్యవర్గ సమావేశాలపైన ఏ ఒక్క మీడియా కూడా ఫోకస్ పెట్టలేకపోయాయి.

దీంతో ముఖ్యమంత్రి కె.సి.ఆర్. హిందీలో ఏకధాటిగా గంటకుపైగా చేసిన ప్రసంగం, ఆ ప్రసంగంలో ఆయన సంధించిన సుమారు 47 రకాల ప్రశ్నలు, నరేంద్రమోడీని, బి.జె.పి.పాలనను ఎండగడుతూ చేసిన విమర్శలు, ఆరోపణలు అన్నీ దేశ ప్రజలు దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు కావడం, ప్రజలు పడుతున్న బాధలను తన ప్రసంగ పాఠంగా చేసుకొని కె.సి.ఆర్. సంధించిన బాణాలు నెటిజన్లను, టీవీ ప్రేక్షకులను, సోషల్ మీడియాను, యూట్యూబర్లను కట్టిపడేశాయి. అంతేగాక ముఖ్యమంత్రి కె.సి.ఆర్. సంధించిన ప్రశ్నలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎట్టిపరిస్థితుల్లో సమాధానాలు చెప్పలేరని, ఎందుకంటే అవన్నీ కఠోర సత్యాలని రాష్ట్రపతి పదవికి పోటీలో ఉన్న అభ్యర్ధి యశ్వంత్ సిన్హా కితాబు ఇవ్వడం కె.సి.ఆర్. ప్రశ్నలకు మరింత బలాన్ని చేకూర్చాయి.

నరేంద్రమోడీ పాలన యావత్తూ దేశ ప్రతిష్టను మంటగలిపిందని, భారతదేశానికి మిత్రదేశాలుగా ఉన్న దేశాలు కూడా బి.జే.పి. విధానాల మూలంగా శత్రువులుగా మారిపోయే ప్రమాదం ఉందని, ప్రస్తుతం భారతదేశం అన్ని అంశాల్లోనూ ప్రమాదంలో ఉందని, ఈ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైనా ఉందని కె.సి.ఆర్. ఇచ్చిన పిలుపు ప్రపంచంలోని భారతీయులందరికీ చేరిందని రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా కె.సి.ఆర్. సంధించిన బాణాల్లాంటి అనేక ప్రశ్నలపై ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల్లో చర్చ మొదలయ్యిందని శనివారం నాటి పరిణామాలు స్పష్టంచేస్తున్నాయని అంటున్నారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన రాజకీయ పరిణాలు భవిష్యత్తులో ఎన్నో రాజకీయ మార్పులు, రాజకీయపరమైన సరికొత్త సమీకరణలకు పునాదులు పడతాయని విశ్లేషకులు అంటున్నారు. కె.సి.ఆర్. సంధించిన ప్రశ్నలకు బి.జె.పి. అగ్రనాయకత్వం ఎలా స్పందిస్తుందో… ఎదురుదాడి చేస్తుందా… లేక ప్రశ్నలకు జవాబు చెబుతుందో… వేచిచూడాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News