Saturday, November 16, 2024

తెలంగాణ ‘కాలనాళిక’

- Advertisement -
- Advertisement -

telugu kavulu rachanalu

రెండువందల ఇరవైనాలుగు సంవత్సరాలు కొనసాగిన అసఫ్ జాహీ, కుతుబ్ షాహిల పాలన నుండి మొదలుపెట్టి ఇప్పటి స్వతంత్య్ర భారతదేశ అమృతోత్సవ సంవత్సరందాకా నిజామ్ రాజ్యం/ తెలంగాణలో వరంగల్లు కేంద్రంగా గత ఏనభై ఏండ్ల చరిత్రను సుప్రసిద్ధ కవి, కథకుడు, నవలాకారుడైన రామా చంద్రమౌళిగారు “కాలనాళిక” పేరుతో ఓ బృహత్ నవల వ్రాయడం జరిగింది. ఇంత బృహత్ నవల ఎందుకు వ్రాయవలసి వచ్చిందో ఆయన మాటల్లోనే…
“తెలంగాణకు సంబంధించి గత ఎనభైఏండ్లుగా కేవలం పాలకుల సమాచార నమోదు మాత్రమే చరిత్రగా పరిగణింపబడుతూ వచ్చింది. అట్లా నమోదుకాబడిన చరిత్ర పరిధులనుదాటి విస్మ ృత వాస్తవిక చరిత్రను నవలగా తీసుకురావాల్సిన ఆవశ్యకతను గుర్తించిన కారణంగా నాకు నేనే ఈ బాధ్యతను భుజాలకెత్తుకోవడం జరిగింది” నవల పొడవునా తెలంగాణ జాతిపితగా పిలువ బడుతున్న ఆచార్య జయశంకర్‌తోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌గారిదాకా ఎందరెందరో చారిత్రక వ్యక్తులు నడిచిరావడమేకాదు, మన చేతులు పట్టుకొని తమతోపాటు నడిపంచుకుని తీసుకుపోతుంటారు. ఎన్నోవాస్తవ పాత్రల మధ్య రాజగోవిందు, రాజ్యలక్ష్మి దంపతులతోపాటు మరికొన్ని కల్పిత పాత్రలుగూడా సముద్రంలో కలిసిపోయిన స్వాతిచినుకులమాదిరిగా వాస్తవపాత్రలన్నంత గొప్పగా నవలలో ఒదిగిపోయి పాఠకులు నవలను వదిలిపెట్టకుండా చదివించేలా పరుగులు తీయిస్తుంటాయి. పందొమ్మిదివందల నలభైఆరు ఫిబ్రవరి ఐదవ తేదీ నుండి నవల మొదలవుతుంది. ఆ రోజుతోనే నవల ఎందుకు ప్రారంభమవుతుందంటే? ఆ రోజున గాంధీమహత్ముడు వరంగల్లు స్టేషన్లో ఆగి అక్కడి ప్రజలను కలుసుకుంటాడు. ఆ రోజుకున్న ప్రాముఖ్యత దృష్ట్యా నవల ఎత్తుగడ అక్కడ మొదలవుతుంది. రచనా నిర్మాణంలో చెయ్యి తిరిగిన సృజనశీలురకు మాత్రమే ఇటువంటి ఆరంభాలు సాధ్యమవుతాయి.

ఒక రచన ఎత్తుగడ, కొనసాగింపు, ముగింపు ఎలావుండాలో సంపూర్ణంగా తెలిసిన మౌళిగారు నవల ఎత్తుగడను ఎక్కడ ఆరంభించాలో అక్కడే ఆరంభించారు.ఈ ఎత్తుగడతోనే నవలకుసంబంధించి రచయిత సగం విజయం సాధించినట్టయ్యింది.ఇటువంటి ఎత్తుగడ అనేది కథన శిల్పమర్మజ్ఞత నెరిగిన సాహితీ సృజనకారునికే తెలిసిన ఒకానొక రహస్యం. ఈ ఎత్తుగడతోనే నవలకుసంబంధించి రచయిత సగం విజయం సాధించినట్టయ్యింది. ఇక నవలో ప్రధాన పాత్ర రాజగోవిందు. ఇతను చేనేత కార్మిక కుటుంబానికి చెందినవాడు. అతను నిజామాంధ్రలో చరిత్ర ప్రసిద్ధికెక్కిన ఆజామ్ జాహి బట్టలమిల్లుల్లో సాంచాలను నడిపే సాంకేతిక నిపుణుడు. నవలమొత్తం రాజగోవిందు, అతని కుటుంబానికి చెందిన పాత్రలు ఎంతో సజీవంగానూ ఉన్నతంగానూ పాఠకుల కండ్ల ముందు కదలాడుతుంటాయి. నవల ఆరంభంలోనే వినూత్న ఉద్విగ్నతకు గురిచేసిన రచయిత ఆ వెంటనే ఆధునిక వరంగల్లుకు అంకురార్పణచేసిన చందా కాంతయ్య దంపతులను ప్రవేశపెడతాడు. కాంతయ్యగారి సతీమణి తన వంటిమీది నగలనుమొత్తం ఒలిచి గాంధీజీ జోలెలో వేస్తుంది. ఉదాత్తమైన వ్యక్తుల కలయికలు ఉదాత్తంగానే వుంటాయన్న సత్యాన్ని పాఠకుల కండ్లముందుంచాడురచయిత. నిజామాంధ్రలో యాభైశాతం తెలుగువారు, పన్నెండుశాతం మస్లీములు, పదకొండుశాతం కన్నడిగులు, పదమూడుశాతం మహారాష్ట్రులు కాగా మిగిలిన అన్నిజాతులవారూ కలిపి పద్నాలుగుశాతం వుండేవారు.

నిజామాంధ్ర విస్తీర్ణం ఇరవైనాలుగువేల నాలుగొందల చ.మై. అందులో ఆరువేల ఎనిమిదివందల నలభైఎనిమిది జాగీర్లుండేవి. నైజామ్‌లో ఏడెనిమిది అధికారిక అంచెలుండేటివి.ఫలితంగా సామాన్యులంతా చెఱకు పిప్పిమాదిరిగా పీల్చివేయబడేవారు. ఆ దోపిడిని, ఆ వెట్టి చాకిరిని గమనించిన మాడపాటి హన్మంతరావులాంటి పెద్దలు కొందరు అందుకు వ్యతిరేకంగా ఆంధ్రజన సంఘాన్ని కొన్నాళ్ళకు అందునుండి ఆంధ్రమహాసభను ఏర్పాటుచేశారు. ఆంధ్రమహాసభద్వారా తెలంగాణలో దొరల దోపిడికి వ్యతిరేకంగా సామాన్యులను సమీకరించి ఉద్యమాన్ని మొదలుపెట్టారు. కమ్యూనిస్ట్ నాయకుడు రావినారాయణరెడ్డి నాయకత్వంలోని ఆంధ్రమహాసభ నైజామ్‌కి, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టింది. ఆ చరిత్రనంతా మధించిన చంద్రమౌళిగారు నిలువెల్లా చలించిపోయి, ప్రతివిషయాన్ని అప్పుడే జరుగుతున్నం సజీవంగా పాఠకుల కండ్లముందు బొమ్మకట్టి చూపించారు. వారి కలానికి వున్న పదునేమిటో పాఠకులకు రుచి చూపించారు. రాజగోవిందు అటు కమ్యునిస్ట్‌నాయకులైన కా.పుచ్చలపల్లి సుందరయ్య ఇటు సాహితీదిగ్గజం ఆళ్వారుస్వామి లాంటివారినుండి స్పూర్తినిపొంది తెలంగాణ సాయుధపోరాటంలో చేరాలని నిర్ణయం తీసుకుంటాడు.

అంతకు ముందే అతని చెల్లెలు వీరలక్ష్మి తన ఊరి దొరలదాష్టికానికి గురికావడంతో వారికి వ్యతిరేకంగా భర్త కైలాసంతోపాటు ఉద్యమంలోకి వెళ్ళిపోతుంది. కడివెండి గ్రామంలో దాదాపు ఎనభైమంది సభ్యులతో ఏర్పడిన సంఘం, దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిలుస్తుంటుంది. ప్రజాసైన్యానికి నల్లా నరసింహులు, కొండారెడ్డి, రేషవల్లి కొండయ్య, దొడ్డిమల్లయ్య, కొమరయ్య వంటి యోధులెందరో నాయకత్వం వహించి పోరుసాగిస్తారు. ఆ పోరాటంలో భాగంగానే తెలంగాణ సాయుధపోరాట ఘట్టంలో దొడ్డి కొమరయ్య తొలి అమరుడవుతాడు.
వరంగల్లుల్లో రజాకార్లచేతిలో మొగిలయ్య హత్యకు గురికావడంతో తెలంగాణ అగ్నిగుండంగా మారిపోతుంది. చాకలి ఐలమ్మ మక్తేదారు భార్య ఐలమ్మ పంటను గుంజుకుని, అవిడను ఆభూమినుండి వెల్లగొట్టాలనుకుంటే ఐలమ్మ దళ సభ్యులసహాయంతో దొరలమీద తిరగబడి తన పంటను తాను కాపాడుకుంటుంది. తెలంగాణ సాయుధపోరాట చరిత్రలో బైరాన్‌పల్లి చరిత్ర ఒక మెజ్వల ఘట్టం. రజాకార్లను మూడుసార్లు మట్టికరిపించిన ఆ గ్రామదళం నాలుగోసారి నిజావు్ సైన్యం, పోలీసులు, రజాకార్లు కలిసి ఉమ్మడిగా సాగించిన పాశవిక దాడిలో ఊరు కుప్పగూలిపోతుంది. దొరికిన దళసభ్యులను ఆడ, మగ అన్న తేడాలేకుండా తీసుకుపోయి నగ్నంగా నిలబెడతారు. ఆడవారితో నగ్నంగానే బతుకమ్మలాడిస్తారు. మగవారిని చెట్లకు కట్టేసి కాల్చి చంపుతారు. ఆ దురంతం తెలంగాణ సాయుధపోరాట చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఈ సంఘటనతో ఇక ఉద్యమంలో కొనసాగే విషయంలో రాజగోవిందు పునరాలోచనలో పడిపోతాడు.

ఆపరేషన్ ‘పోలో’ దెబ్బకు దిగివచ్చిన నిజామ్ నవాబ్ భారతప్రభుత్వంముందు లొంగిపోతాడు. ఫలితంగా 1948 సెప్టెంబర్, 17 నైజామ్ రాజ్యం భారత యూనియన్లో విలీనమైపోతుంది. భారత ప్రభుత్వం కమ్యునిస్ట్‌పార్టీమీద నిషేధం విధించింది. దాంతో నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నాయకులు అర్ధంతరంగా ఉద్యమాన్ని విరమించినట్టుగా ప్రకటిస్తారు. దాంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతారు. దాదాపు నాలుగువేల మంది కార్యకర్తలను కోల్పోయిన పార్టీ చరిత్ర మసక బారిపోయింది.పార్టీ నిట్టనిలువున రెండుగా చీలిపోయింది.అక్కడి నుండి కమ్యూనిస్ట్‌పార్టీల పనితీరు నానాటికీ తీసికట్టు నాగంభట్టు అన్న చందంగా తయారయ్యింది.

నైజామ్‌కు లేదా తెలంగాణకు సంబంధించి ఇక్కడి వరకు జరిగింది తొలిచరిత్రగా పేర్కొనవచ్చు. ఉద్యమప్రస్థానం ముగిసిపోయిన తరువాత ఇల్లుచేరిన రాజగోవిందు, భార్య రాజ్యలక్ష్మి సలహామేరకు రాజ్యలక్ష్మి టెక్స్‌టైల్స్‌ను ఆరంభిస్తాడు. అదిఆర్ధికంగా నిలదొక్కుకుంటుంది. మూడువందల కుటుంబాలవారికి జీవనోపాధిని చూపించగల్గుతారు. రాజగోవిందు పిల్లలంతా బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగాల్లో కుదురుకుంటారు. రాజగోవిందు వరంగల్లుల్లో ఒక ప్రముఖవ్యక్తిగా గుర్తింపు పొందుతాడు.
రాజగోవిందు బావ కైలాసం ఉద్యమంలో అమరుడవుతాడు. భర్తను కోల్పోయిన అతని చెల్లెలు వీరలక్ష్మి మెల్లగా బొంబాయికి చేరుకుని చిన్న భోజనెటల్ పెట్టుకుంటుంది. తనరెక్కల కష్టంతో దాన్ని అభివృద్ధిచేయడమే కాకుండా క్రమంగా నగరంలో ఎన్నో బ్రాంచీలుకూడా ఏర్పాటు చేస్తుంది. ఆవిడ కొడుకు ఎం.ఎల్.ఎ.దాకా ఎదుగుతాడు.అట్లా వాళ్ళ కుటుంబాలు స్థిరపడిపోయాయి. ఇక తెలంగాణ మలిచరిత్ర భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాతో మొదలయ్యింది. ఆ ఏర్పాటును తెలంగాణ ప్రాంతంవారు అంగీకరించనప్పటికీ జరిగిపోయింది.

తదనంతర కాలంలో తెలంగాణ ప్రాంతం వారు భయపడినట్టుగానే అన్ని రంగాలలోనూ ఆంధ్రాప్రాంతంవారి ఆధిపత్య ధోరణి భరించరాని స్థాయిలో కొనసాగడం మొదలయ్యింది. దాంతో సహనం కోల్పోయిన తెలంగాణావారు 1969లో మొట్టమొదటిసారిగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆరంభించారు. ఆ ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో 369 మంది విద్యార్ధులు అమరులయ్యారు. కొందరు స్వార్ధపరులైన రాజకీయనాయకుల కారణంగా ఉద్యమం సమసిపోయింది. తిరిగి 33 సంవత్సరాల తరువాత, 2001లో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ప్రత్యేకతెలంగాణ సాధనకోసం మలి ఉద్యమం ప్రారంభమయ్యింది. అనేక పోరాటాల ఫలితంగా 02 జూన్,2014తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారమయ్యింది. దేశంలో ఇరవైతొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. చంద్రశేఖర్‌రావు తొలిమ్యుమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అతని నేతృత్వంలో బంగారు తెలంగాణ సాధనకోసం శ్రమిస్తున్నారు. రచయిత ఇట్లా ఎనభై ఏండ్ల తెలంగాణ చరిత్రను అక్షరబద్ధం చేసే క్రమంలో కొన్ని చిన్న చిన్న సంఘటనలు విస్మృతికిలోనయ్యే అవకాశం తప్పకుండా వుంటుంది. అటువంటివి అక్కడక్కడా దొర్లినా వాటినంతగా పట్టించుకోవాల్సిన అవసరంలేదేమో. చంద్రమౌళిగారు ఈ విధంగా ఎనభైఏండ్ల తెలంగాణ చరిత్రనంతా ఎంతో వివరంగానూ, పఠనీయతతోనూ మలిచినతీరు ఎంతైనా ప్రశంశనీయం. తెలంగాణ చరిత్రను తెలుసుకోవాలనుకునే వారికి ఈ ‘కాలనాళిక’ ఒక విజ్ఞాన సర్వస్వంగా పనికొస్తుంది. మౌళిగారు ఎంతో శారీరక,మానసిక శ్రమలకు ఓర్చి, తన తెలంగాణ చరిత్రను, తన తెలంగాణ ప్రజలకు అందించాలన్న ఏకైక లక్ష్యంతో రచించిన ఈ ‘కాలనాళిక’ ప్రతి తెలంగాణ ఇంటిలోనూ తప్పకుండా వుండితీరాల్సిన పుస్తకం. ఈ నవలకు గాను గతంలో రచయిత రామా చంద్రమౌళిగారు కాళోజి పురస్కారాన్ని రాష్ట్రముఖ్యమంత్రిగారి చేతులు మీదుగా అందుకున్నారు. అదే నవలకు ఇప్పుడు 2019 సంవత్సరానికిగాను ఉత్తమ నవలగా తెలుగు విశ్వవిద్యాలయం నుండి ది:07072022 న హైదరాబాద్‌లో అందుకోబోతున్న సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ…

శిరంశెట్టి కాంతారావు
9849890322

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News