ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్‌నాథ్ షిండే వర్గం తన బలాన్ని నిరూపించుకుంది. విశ్వాస పరీక్షలో సోమవారం 164 మంది ఎంఎల్‌ఏలు షిండేకి మద్దతుగా ఓటేశారు. మెజార్టీ మార్క్ 144 కన్నా ఎక్కువే సాధించారు. దాంతో బలపరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. సోమవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే బిజెపి, శివసేన నేతల ప్రతిపాదన మేరకు స్పీకర్ విశ్వాస పరీక్ష చేపట్టారు. మొదట మూజువాణి ఓటు ద్వారా బలపరీక్ష నిర్వహించారు. అయితే డివిజన్ ఆఫ్ ఓట్ పద్ధతిలో బలపరీక్ష చేపట్టాలని ప్రతిపక్షం డిమాండ్ చేయడంతో స్పీకర్ దానికి అంగీకరించి డివిజన్ ఆఫ్ ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు. షిండే అనుకూల ఎంఎల్‌ఏలు లేచి నిలబడ్డంతో అసెంబ్లీ సిబ్బంది లెక్కించారు. షిండేకు మద్దతుగా 164 ఓటేయగా, 99 మంది వ్యతిరేకంగా(ఠాక్రే పక్షంకు) ఓటేశారు. కాగా ముగ్గురు ఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
విశ్వాస పరీక్షకు కొద్దిసేపు ముందే హింగోలి జిల్లా కలమ్నూరి నియోజకవర్గం ఎంఎల్‌ఏ సంతోష్ బంగర్ తాను షిండే వర్గంలో చేరుతున్నట్లు ప్రకటించారు. దాంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి షాక్ తగిలింది. కాగా ప్రతిపక్ష ఎంఎల్‌ఏలు ‘ఈడి..ఈడి’(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అంటూ నినాదాలు చేశారు. ఈడి దర్యాప్తులకు భయపడే శివసేన ఎంఎల్‌ఏలు తిరుగుబాటు చేసినట్లు ఠాక్రే వర్గం మొదట్నుంచీ ఆరోపిస్తోంది. షిండే వర్గానికి చెందిన ప్రతాప్ సర్‌నాయక్ ఓటేసేటప్పుడు కూడా వారు ఇలాంటి నినాదాలే చేశారు. ప్రతాప్ సర్‌నాయక్ కూడా ఓ మనీలాండరింగ్ కేసులో ఈడి విచారణను ఎదుర్కొంటున్నారన్నది ఇక్కడ గమనార్హం.
మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ నర్వేకర్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన సభాపక్ష నేతగా అజయ్ చౌదరిని తొలగించి, ఆయన స్థానంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను తిరిగి నియమించారు. చీఫ్ విప్ పదవిలోనూ షిండే వర్గ ఎంఎల్‌ఏను నియమించారు. కాగా చీఫ్ విప్ నియామకాన్ని సవాలు చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ ఆ పిటిషన్‌పై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది. అసమ్మతి ఎంఎల్‌ఏల అనర్హతపై దాఖలైన ఇతర పిటిషన్లతో పాటు ఈ తాజా పిటిషన్‌ను కూడా జులై 11న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
Maharashtra Dy. CM Devendra Fadnavis addresses the Assembly, heaps praises on CM Shinde
Join this broadcast with @RitangshuB#Maharashtra #ShivSena #EknathShinde #floortest pic.twitter.com/5guLLcVLuY
— News18 (@CNNnews18) July 4, 2022