హైదరాబాద్: వ్యవసాయ రంగంలో తెలంగాణ పది శాతం వృద్ధిరేటును సాధించిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రధాని మోడీకి హరీష్ రావు రీకౌంటర్ ఇచ్చారు. వ్యవసాయ రంగంలో దేశమంతా మూడు శాతమే మాత్రమే వృద్ధి ఉందన్నారు. రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే రాష్ట్రంలో సాధ్యమైందన్నారు. బిజెపి నాయకులవి ఊకదంపుడు ఉపన్యాసాలు మాత్రమేనని, కేంద్రం ప్రభుత్వం చేయనది చెప్పుకుంటుందని చురకలంటించారు. నిధులు పుష్కలంగా ఉన్నవి కాబట్టే తెలంగాణలో అభివృద్ధి కనిపిస్తోందన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల కన్న తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం పదోవ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకామన్నారు.
సంపద పెరిగింది కాబట్టే సంక్షేమ పథకాలు ఘనంగా అమలు చేస్తున్నామని, పెరిగిన సంపదను పేదలకు పంచుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేశానికే రోల్ మోడల్ గా ఉందన్నారు. సంపద పెరిగిందే కాబట్టే పెన్షన్ రూ.200 నుంచి రూ. 2000 పెంచామన్నారు. కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇస్తే మరింద అభివృద్ధి జరిగేదన్నారు. దేశ చరిత్రలో ఆర్థిక సంఘం రిపోర్ట్ ను అమలు చేయని ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని హరీష్ రావు మండిపడ్డారు. అమిత్ షాను నిధులు ఇస్తారా అని అడిగితే, ఇవ్వాల్సిన నిధులు ఎందుకు ఇవ్వడంలేదని హరీష్ రావు ప్రశ్నించారు. గత ఎనిమిదేండ్ల నుంచి మోడీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో వైట్ పేపర్ పై ఇవ్వాలని డిమాండ్ చేశారు.
16 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఉద్యోగాలు తీసేసిన చరిత్ర బిజెపిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియమకాల గురించి మాట్లాడే హక్కు బిజెపికి లేదని చురకలంటించారు. తెలంగాణ పథకాలను మోడీ ప్రభుత్వం కాపీ కొడుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ మెరుగైన పథకం అని ప్రశంసించారు. 8 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కేంద్రం ఎందుకు తీసుకరావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి ఎందుకు తేల్చలేదన్నారు. ఎనీ టైమ్ మీటర్ అనే చెప్పే బిజెపికి ఎన్ టైమ్ వాటర్ ఇచ్చే కాళేశ్వరం గురించి అర్థం కాదన్నారు. ఆరు నెలల నుంచి ఎఫ్ సిఐ బియ్యం సేకరణ ఆపిందని, బియ్యం సేకరణ ఎందుకు ఆపారో చెప్పాలని నిలదీశారు.