నిజామాబాద్ గ్రామీణ బ్యాంక్‌లో చోరీ
రూ.7.22 లక్షల నగదు, 8.250 కిలోల బంగారం అపహరణ
గ్యాస్ కట్టర్ వేడికి నగదు కాలిబూడిదైన రూ.7.30 లక్షల నగదు
మనతెలంగాణ/హైదరాబాద్(మెండోరా):నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దొంగలు రూ.7.22 లక్షల నగదుతో పాటు 8.250 కిలోల బంగారం దోచుకెళ్లిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మెండోరా మండలం బుస్సాపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో శనివారం రాత్రి చొరబడిన గుర్తు తెలియని దొంగలు నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. ఆదివారం బ్యాంక్ సెలవు కావడంతో సోమవారం నాడు చోరీ విషయం బయటకొచ్చింది. ఈ చోరీ ఘటన జులాయి సినిమాలో సంఘటనను తలపించింది. దొంగలు గ్యాస్ కట్టర్ల సాయంతో బ్యాంక్ షట్టర్ తెరిచి లోపలికి ప్రవేశించిన వెంటనే సిసిటివి కెమెరాల వైర్లను ధ్వంసం చేశారు. అనంతరం గ్యాస్ కట్టర్లతో లాకర్లను తెరిచి 8.250 కిలోల బంగారంతో పాటు రూ.7.22 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. కాగా గ్యాస్ కట్టర్‌ల వేడికి దాదాపు రూ. 7.30లక్షల నగదు కాలిబూడిదైనట్లు పోలీసులు గుర్తించారు.
మంకీ క్యాప్ మాస్కులతో ః
తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో చోరీ జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రత్యేక క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోందని, దొంగలు మంకీని పోలిన మాస్కులు ధరించి దొంగతనానికి పాల్పడ్డారని సిపి నాగరాజు తెలిపారు. దొంగల కోసం 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
కాలిపోయిన రూ.7.30 లక్షల నగదు ః
గ్రామీణ బ్యాంక్‌లో చోరీ సమయంలో దొంగలు గ్యాస్ కట్టర్లు ఉపయోగించటం వల్ల సుమారు రూ.7 లక్షల 30 వేల నగదు కాలిపోయిందని సిపి నాగరాజు తెలిపారు. అలాగే రూ.3.50 కోట్ల విలువ గల 8 కిలోల పైచిలుకు బంగారం వరకు చోరీ అయినట్టు వివరాలను సిపి వెల్లడించారు. దొంగలు అంతరాష్ట్ర ముఠాగా అనుమానంగా ఉందని, త్వరలో నే దొంగలను పట్టుకుంటామని ఆయన తెలిపారు.
Massive Theft in Nizamabad Grameena Bank