కరాచీలో అత్యవసర ల్యాండింగ్
న్యూఢిల్లీ : ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన మరో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తోన్న స్పైస్‌జెట్ ఎస్‌జీ 11 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫ్యుయల్ ఇండికేటర్‌లో సమస్య తలెత్తడంతో విమానాన్ని పాకిస్థాన్ లోని కరాచీకి దారి మళ్లించారు. కరాచీ ఎయిర్‌పోర్టులో విమానాన్ని సురక్షితంగా దించేశారు. గత 17 రోజుల్లో స్పైస్‌జెట్ విమానంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇది ఆరోసారి. తాజా ఘటనపై స్పైస్‌జెట్ స్పందించింది. ఇండికేటర్ సమస్య కారణంగా విమానం ఆగిపోవాల్సి వచ్చిందని సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. ఎడమ ట్యాంక్‌లో అసాధారణ స్థాయిలో ఇంధనం తగ్గినట్టు ఇండికేటర్ చూపించింది. అయితే గతంలో ఈ విమానానికి ఎలాంటి సాంకేతిక సమస్య ఎదురవ్వలేదన్నారు. ప్రయాణికులను దుబాయి తీసుకెళ్లేందుకు కరాచీ ఎయిర్‌పోర్టుకు మరో విమానాన్ని పంపిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఎ ) విచారణకు ఆదేశించింది.