బెంగళూరు : కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ బిజెడ్ జమీర్ అహ్మద్‌ఖాన్ కు అపరిమిత ఆస్తులు ఉన్నాయన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫిర్యాదుపై అవినీతి నిరోధక శాఖ విభాగం అధికారులు అహ్మద్‌ఖాన్‌కు చెందిన ఆస్తులపై ఐదు చోట్ల మంగళవారం ఒకేసారి దాడులు చేశారు. కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపాన గల అహ్మద్ ఖాన్ నివాసం , సిల్వర్ ఓక్ అపార్టుమెంట్స్‌లో ఒక ఫ్లాట్ , సదాశివనగర్ లోని గెస్ట్‌హౌస్, బాణాశంకరి జికె అసోసియేట్స్ ఆఫీస్, కలసిపల్య లోని నేషనల్ ట్రావెల్స్ ఆఫీస్‌లపై దాడులు జరిగాయి. ఉదయం నుంచి అనేక బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. డాక్యుమెంట్లు పరిశీలించడమౌతోందని, దర్యాప్తు కొనసాగుతోందని ఎసిబి అధికారులు చెప్పారు. నాలుగుసార్లు ఎమ్‌ఎల్‌ఎ అయిన ఖాన్ 2018 2019 మధ్య కాలంలో ఏడాది పాటు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మంత్రిగా పనిచేశారు. గత ఏడాది ఆగస్టులో ఖాన్‌తోపాటు మరో మాజీ మంత్రి ఆర్ రోషన్ బెయిగ్ నివాసాలపై ఈడీ దాడులు చేసింది. రూ. 4000 కోట్ల ఐఎంఎ పొంజి స్కీమ్‌తో వీరికి సంబంధం ఉందన్న ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. ఈ స్కీమ్ వల్ల వేలాది మంది ఎక్కువగా ముస్లింలు తమ కష్టార్జితాన్ని కోల్పోయారన్న ఫిర్యాదులు ఉన్నాయి.