Saturday, November 23, 2024

అన్ని గురుకులాల్లో ఇంటర్ విద్య

- Advertisement -
- Advertisement -

CM KCR review On education and employment related issues

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని స్టడీ సర్కిళ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు సహా యువత చదువుకు తగ్గ ఉద్యోగ ఉపాధి సమాచారాన్ని, గైడెన్స్ ను అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సిఎం అన్నారు. కేవలం రాష్ట్రస్థాయి ఉద్యోగాల కోసమే కాకుండా దేశవ్యాప్తంగా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లో కూడా ఉద్యోగ శిక్షణను అందించాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రకటించే ఖాళీల భర్తీ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు సమీకరించి అందుకనుగుణంగా శిక్షణ అందించాలన్నారు.

ఎస్‌సి, ఎస్‌సి, బిసి, మైనార్టీ విద్యార్థినీ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యనందించడం, పోటీ పరీక్షలకు శిక్షణనివ్వడం, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, గురుకుల పాఠశాలను ఇంటర్మిడియేట్ కళాశాలలుగా ఉన్నతీకరించడం వంటి బడుగు బలహీనవర్గాలకు విద్యా, ఉపాధి సంబంధిత అంశాలపై మంగళవారం నాడు ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ, ఎస్‌సి, ఎస్‌సి, బిసి, మైనార్టీ వర్గాలకు ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలన్నారు.పదో తరగతి వరకు విద్యనందిస్తున్న రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మిడియేట్ విద్యను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈమేరకు ఈ విద్యా సంవత్సరం నుంచే తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

శిక్షణ ఇచ్చే రిక్రూట్‌మెంట్ కేంద్రాలు మారాలి

ఎస్‌సి, ఎస్‌సి, బిసి, మైనార్టీ వర్గాల పిల్లలకు ఉద్యోగ ఉపాధి రంగాల్లో విజయావకాశాలను సాధించిపెట్టే అస్త్రాలుగా రాష్ట్ర ప్రభుత్వం నడిపే స్టడీ సర్కిళ్లు రూపాంతరం చెందాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. అవి శిక్షణనిచ్చే క్యాంపస్ రిక్రూట్ మెంట్ కేంద్రాలుగా మారాలన్నారు. ఎంప్లామెంట్ అవెన్యూలుగా స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దాలని సూచించారు. కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో, దేశవ్యాప్తంగా అందివచ్చే ఉద్యోగాలను అందిపుచ్చుకునే విధంగా యువతను తీర్చిదిద్దాలన్నారు. ఒక ప్రతిభావంతమైన స్టడీ సర్కిల్ ఎలా ఉండాలో విధి విధానాలను అధికారులు రూపొందించాలని….. ఇందుకు సమర్ధవంతులైన అధికారులను నియమించాలని ఆదేశించారు.

ఐటిఐ, పాలిటెక్నిక్, ఫార్మా, కెమికల్, ఇండస్ట్రీ, డిఫెన్స్, రైల్వే, బ్యాంకింగ్, నర్సింగ్, అగ్రికల్చర్ తదితర కోర్సులను పూర్తి చేసుకున్న తెలంగాణ యువతీ యువకులకు దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధిని కల్పించే అద్భుతమైన భూమికను స్టడీ సర్కిళ్లు పోషించాలని ఆకాంక్షించారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు అనే కోణంలోనే కాకుండా ప్రైవేట్ రంగాలలో కూడా ఉపాధిని అందించగలిగే కేంద్రాలుగా మారాలన్నారు. శిక్షణ పొందుతున్న అర్హులైన అభ్యర్థులకు స్టడీ సర్కిళ్లలో భోజన వసతులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి స్టడీ సర్కిల్ లో కంప్యూటర్ లు, అత్యాధునిక సాంకేతిక మౌలిక వసతులను కల్పించాలన్నారు. ఆయా జిల్లాల్లో ఆయా వర్గాల జనాభా నిష్పత్తిని అనుసరించి ప్రవేశాలు కల్పించే దిశగా విధివిధానాలు రూపొందించాలన్నారు. బాలురకు కల్పించినట్టుగానే బాలికలకు కూడా స్టడీ సర్కిళ్లల్లో ప్రత్యేక వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అని సిఎం తెలిపారు.

ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్, గ్రూప్… 1 వంటి కేంద్ర, రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు శిక్షణనిచ్చేందుకు ‘ఆల్ ఇండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్’ ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.

గురుకులాల్లో ఇంటర్మీడియేట్ విద్య

ప్రాథమిక విద్యనుంచి ఉన్నతవిద్య వరకు పునాది వేస్తున్నట్టే, విద్యార్థి దశలో కీలకమైన మలుపుగా భావించే ఇంటర్మీడియేట్ విద్య వరకు కూడా ప్రభుత్వమే పునాది వేయాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియేట్ కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు. బాలికలకు ప్రత్యేకంగా విద్యను అందిస్తున్న కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో కూడా ఇంటర్మీడియేట్ విద్యను ప్రవేశ పెట్టాలన్నారు. ఇందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉన్నతాధికారిని నియమించాలన్నారు. ప్రతి సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంతమంది? వారు పదో తరగతి అనంతరం వారు ఎంచుకుంటున్న మార్గాలు తదితర అంశాలపై సమగ్ర నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు వినియోగించుకోవాలని సిఎం అన్నారు.

బిసి గురుకుల కళాశాలల ఏర్పాటు

రాష్ట్రంలో ప్రస్తుతమున్న గురుకుల డిగ్రీ కళాశాలకు అదనంగా మరో 15 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. రాబోయే విద్యా సంవత్సరంలో వీటిని 17 కు పెంచి మిగతా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని, మొత్తంగా జిల్లాకో డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల చొప్పున 33 బిసి గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సిఎస్‌ను కెసిఆర్ ఆదేశించారు. బిసి వర్గాల జనాభా అధికంగా ఉందని, వారి జనాభా దామాషా ప్రకారం రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పెంచాలన్నారు. సాంప్రదాయ కోర్సులను కాకుండా నేటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగావకాశాలను కల్పించే డిగ్రీ కోర్సులను రూపొందించాలని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి విధివిధానాలను రూపొందించాలన్నారు. అలాగే ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 33 జిల్లాల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే బిసి గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సమీక్షా సమావేశం లో బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎస్‌సి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంఎల్‌సి ఎస్.మధుసూధనాచారి, శాసనసభ్యులు జైపాల్ యాదవ్, రోహిత్ రెడ్డి, విద్యాసాగర్, సిఎస్ సోమేశ్ కుమార్, సిఎంఒ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.నర్సింగ్ రావు, బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, సిఎంఒ సెక్రటరీ స్మితా సబర్వాల్, సిఎంఒ సెక్రటరీ రాహూల్ బొజ్జా, సిఎం ఒఎస్‌డి వర్గీస్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి రోనాల్ రోస్, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్, అల్ప సంఖ్యాక వర్గాల గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి బి.షఫియుల్లా, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా చొంగ్తూ, బిసి సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News