సమృద్ధిగా కురిసే వర్షాలతో హరితహారాన్ని విజయవంతం కావాలి
ఎనిమిదో విడత హరితహారంలో భాగంగా అందరూ మొక్కలు నాటాలి
వివిధ శాఖలో అధికారులతో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమావేశం
హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించాలని, సమృద్ధిగా కురిసే వర్షాలతో హరితహారాన్ని విజయవంతం చేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి అధికారులకు సూచించారు. బుధవారం తెలంగాణకు హరితహారంపై రాష్ట్రస్థాయి పరిశీలన- సమన్యయ కమిటీ సమావేశం అరణ్య భవన్‌లో జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని ఖాళీ ప్రాంతాలు హరితమయం అయ్యేలా ఎనిమిదో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని సంబంధిత అన్ని శాఖలకు ఆమె విజ్ఞప్తి చేశారు. అటవీ, మున్సిపల్, సాగునీటి, పంచాయతీ రాజ్ శాఖలతో పాటు జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో జరిగిన ఏడు విడతల హరితహారం కార్యక్రమాల అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈ సంవత్సరం కూడా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి కోరారు.
శాఖల వారీగా పెట్టిన మొక్కలు నాటే లక్ష్యాలు, నర్సరీల్లో లభ్యత, అవసరమైన సామగ్రి (ప్లాంటింగ్ మెటరీయల్), పురోగతిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ ఏడాది 19.54 కోట్ల మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా నాటడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు. (పంచాయతీ రాజ్ – రూ.8.76 కోట్లు, మున్సిపల్ శాఖ- 7.32 కోట్లు (మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏలు కలిపి), సాగునీటి శాఖ- 5 కోట్లు, అటవీ శాఖ- 1.54 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ధేశించారు).
ఈ కార్యక్రమాన్ని మాములుగా తీసుకోవద్దు
హరితహారం కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితుల్లో మాములుగా తీసుకోవద్దని, ఈ కార్యక్రమం వల్ల పర్యావరణ హితంతో పాటు, ప్రభుత్వానికి, పాల్గొన్న శాఖలకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆమె సూచించారు. రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన నేపథ్యంలో మంచి వర్షాలు కురుస్తున్నాయని, మొక్కలు నాటడాన్ని వేగవంతం చేయాలని ఆమె ఆదేశించారు. ప్రాంతాలను, నేల తత్వాన్ని బట్టి మొక్కలు నాటాలని, వీలైనంత వరకు నేటివ్ స్పీసీస్‌కు(ప్రాంతీయ మొక్కలకు) ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె తెలిపారు. కోనో కార్పస్ రకం మొక్కలు నాటడంపై భిన్నాభిప్రాయలు ఉన్నందున వాటిని హరితహారంలో భాగంగా నాటడాన్ని నిలిపివేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ పరిధిలో మొక్కలు నాటే కార్యాచరణ గురించి ఆమె అధికారులతో సమీక్షించారు. ఇరిగేషన్ శాఖ పరిధిలో సాగునీటి ప్రాజెక్టులు, కాలువల వెంట పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఈసారి ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు వెల్లడించాడు. ఈ సమావేశంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్ అండ్ హెచ్‌ఓఓఎఫ్) ఆర్.ఎం. డోబ్రియల్, మున్సిపల్ శాఖ కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ, అదనపు పిసిసిఎఫ్ ఏ.కే.సిన్హా, హెచ్‌ఎండిఏ డైరెక్టర్ (అర్బన్ ఫారెస్ట్రీ) డాక్టర్ ప్రభాకర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.