న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ కిష్టార్ కేంద్రం కిరు హైడ్రో పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టు పనుల్లో మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రమేయంతో లంచాల బాగోతం సాగిందన్న ఆరోపణలపై దేశం మొత్తం మీద 16 చోట్ల సిబిఐ సోదాలు చేపట్టింది. 2019 లో ఈ ప్రాజెక్టు పనుల కోసం మాజీ గవర్నర్ లంచాలు పుచ్చుకుని కాంట్రాక్టులు అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ప్రమేయం ఉన్న మధ్యవర్తులు, ఉద్యోగులు వారి సహచరుల ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి. శ్రీనగర్‌లో రెండు చోట్ల, జమ్ములో ఐదు, ఢిల్లీలో ఐదు, ముంబైలో మూడు చోట్ల, పాట్నాలో ఒక చోట సోదాలు నిర్వహించారు. ఈ దర్యాప్తులో చినాబ్ వాలీ పవర్ ప్రాజెక్టు అప్పటి ఛైర్మన్ నవీన్ కుమార్ చౌదరితోపాటు మరికొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లల్లో సోదాలు చేపట్టి వారి మధ్య సాగిన ఆర్థిక లావాదేవీల వ్యవహారాలను కనుగొన్నారు. ముంబై లోని పటేల్ ఇంజినీరింగ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రూపెన్ పటేల్, విజయగుప్తా, అమరేందర్ సింగ్ తదితరులతోపాటు మరికొంతమంది అధికారుల నివాసాల్లో సోదాలు జరిగాయి.