నేను కాంగ్రెస్ మనిషినే కానీ,
ప్రజలకు న్యాయం జరిగే చోట ఉండాలని నిర్ణయం తీసుకున్నా
తీవ్ర చర్చకు, సంచలనంగా మారిన బిజెపి నేత కొండా వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: తాను కాంగ్రెస్ మనిషినేనని, కానీ ప్రజలకు న్యాయం జరిగే చోటే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు చేవెళ్ల మాజీ ఎంపి, కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుత బిజెపి నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి వివరించారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు తెరలేపాయి. నిన్నగాక మొన్ననే బిజెపిలో చేరిన ఆయన తాను కాంగ్రెస్ మనిషినే అని పేర్కొనడం సంచలనంగా మారింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సాధారణ రాజకీయ నేతలకు కొంత భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఆయనకు కాంగ్రెస్‌తో విడదీ యరాని సంబంధం ఉన్నది. తెలంగాణ సమరయోధుడైన కొండా వెంకట రంగా రెడ్డి మనవడే కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వెంకట రంగారెడ్డి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన చేసిన కృషికి గుర్తుగానే ప్రస్తుతం ఆయన పేరిటనే మనం పిలుచు కుంటున్న రంగారెడ్డి జిల్లాకు పేరు పెట్టారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌ను దగ్గరగా చూస్తూ పెరిగారు. రాజకీయాల్లోనూ ఆ పార్టీ నుంచే పట్టు పెంచుకున్నాడు. కానీ, తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ పిలుపుతో ఆయన టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2014లో చేవెళ్ల నుంచి ఎంపిగా గెలిచారు.
కానీ, ఆ తర్వాత కొన్ని కారణాల రీత్యా టిఆర్‌ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు బిజెపి పార్టీలోకి మారారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రులు, సీనియర్ నేతల సమక్షంలో కమలం పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన తర్వాత కొండా విశ్వేశ్వర్ రెడ్డి తొలిసారిగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీకి 2021లో రాజీనామా చేసినప్పటి నుంచి తటస్థంగానే ఉన్నానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. అప్పుడు ఎవరూ ఏమీ అనలేదని, ఏమీ పట్టించుకోలేదని అన్నారు. కానీ, ఇలా బిజెపిలో చేరగానే అలా తనపై వ్యాఖ్యలు వస్తున్నాయని, చాలా మంది తనను అడుగు తున్నారని వివరించారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ను అడ్డుకోవడం బిజెపికే సాధ్యం అని అన్నారు. కాబట్టి తాను టిఆర్‌ఎస్‌ను అడ్డుకోవడానికి బిజెపిలో చేరారని తెలిపారు.
Konda Vishweshwar Reddy Sensational Comments