Friday, December 20, 2024

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా
సొంత పార్టీ నేతల అభీష్టం మేరకు రాజీనామా చేస్తున్నా
కొత్త నేతను ఎన్నుకునే దాకా ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతా
ప్రపంచంలో గొప్ప పదవినుంచి తప్పుకొంటున్నందుకు విచారిస్తున్నా
జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో బోరిస్ వెల్లడి
అక్టోబర్‌లో నూతన నాయకుడిని ఎన్నుకునే అవకాశం

లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ నేతలనుంచి వచ్చిన ఒత్తిడిమేరకు ఆయన ప్రధాని పదవినుంచి తప్పుకునేందుకు గురువారం అంగీకరించాల్సి వచ్చింది. అధికార కన్సర్వేటివ్ పార్టీ అధినేత పదవినుంచి తప్పుకునేందుకు కూడా ఆయన ప్పుకోవల్సి వచ్చింది. అయితే కొత్త ప్రధానిని ఎన్నుకునేంత వరకు ఆయన ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. బోరిస్ నాయకత్వంపై ఆయన మంత్రులు, అధికారులు విశ్వాసం కోల్పవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. జాన్సన్ వైదొలగాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇద్దరు కీలక మంత్రులు రాజీనామా చేయగా.. బుధవారం మరో 15 మంది మంత్రులు రాజీనామా చేశారు. కేవలం 48 గంటల్లోనే దాదాపు 45 మంది మంత్రులు రాజీనామా చేశారు. గురువారం బోరిస్ రాజీనామా ప్రకటన చేయడానికి కొన్ని గంటలక్రితం బోరిస్‌కు అత్యంత సన్నిహితుడైన ఆర్థిక మంత్రి, ఇరాక్ జాతీయుడు నదిమ్ జాహవి కూడా ప్రధాని దిగి పోవాలని డిమాండ్ చేశారు. ‘ వెళ్లిపోవడమే ఇప్పుడు మీరు చేయాల్సిన పని’ అనిఆయన వ్యాఖ్యానించారు. దీంతో విధిలేని పరిస్థితిలో జాన్సన్ ప్రధాని పదవినుంచి తప్పుకోవడానికి అంగీకరించాల్సి వచ్చిందని బ్రిటీష్ మీడియా పేర్కొంది. కొత్త నాయకుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేంత వరకు తాను పద్ధర్మ ప్రధానిగా పదవిలో కొనసాగుతానని 58 ఏళ్ల జాన్సన్ ప్రకటించారు. అక్టోబర్‌లో జరిగే కన్సర్వేటివ్ పార్టీ సమావేశంలో పార్టీ కొత్త నేతను ఎన్నుకుంటారని తెలుస్తోంది. గురువారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో తన రాజీనామా విషయాన్ని స్వయంగా ప్రకటించిన జాన్సన్ ప్రపంచంలోనే అత్యుత్తమ పదవిని వదులుకుంటున్నందుకు ఎంతో విచారంగా ఉన్నట్లు తెలిపారు. ‘పార్టీకి కొత్త నాయకుడు ఉండానేది పార్టీ ఎంపిల స్పష్టమైన అభిప్రాయంగా ఉంది. కన్సరేటరీ పార్టీ ఎంపిలు, మంత్రివర్గ సహచరుల పిలుపును శిరసావహిస్తూ నేను ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని ఆయన చెప్పారు. కొత్త నాయకుడిఎంపికకు సంబంధించిన ప్రక్రియను వచ్చేవారం ప్రకటించడం జరుగుతుందని, కొత్త నాయకుడి ఎంపిక పూర్తయ్యేంతవరకు పని చేయడం కోసం కొత్త మంత్రివర్గాన్ని కూడా నియమించినట్లు బోరిస్ జాన్సన్ చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారని, అందువల్లనే ఆ తీర్పును అమలు చేయడం కోసమే గత కొద్ది రోజులుగా తాను గట్టిగా పోరాటం చేయాల్సి వచ్చిందని కూడా జాన్సన్ చెప్పుకున్నారు. గత మూడేళ్ల కాలంలో కొన్ని వైఫల్యాలు ఉన్నపప్పటికీ బ్రెగ్జిట్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినందుకు గర్విస్తున్నానని బొరిస్ చెప్పారు.
వివాదాల ప్రధాని
2019 జులై 24న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బొరిస్ జాన్సన్ మూడేళ్ల పదవీ కాలంలో అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. వివాదాలతోనే పాలనా పగ్గాలు చేపట్టిన ఆయన ప్రధానిగాను ఎన్నోసార్లు విమర్శల సుడిగుండంలో చిక్కుకున్నారు. ఆ తర్వాత తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పినప్పటికీ ఆ అపకీర్తిని మాత్రం పోగొట్టుకోలేక పోయారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత జాన్సన్ డౌనింగ్‌స్ట్రీట్‌లోని తన నివాసంలో కొన్ని మార్పులు చేయించారు. సెలబ్రిటీ డిజైనర్లతో ఇంటిని రీ డిజైనింగ్ చేయించారు. అయితే ఇందులో అవినీతి జరిగందనే ఆరోపణలు వచ్చాయి. బ్రిటీష్ మీడియా కథనాల ప్రకారం ఈ హంగులకు 2 లక్షల యూరోలు ఖర్చయిందట. అయితే ఈ ఖర్చుల కోసం ఆయన కన్సర్వేటివ్ పార్టీ దాతనుంచి విరాళం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు రావడం అప్పట్లో కలకలం రేపింది.
పార్టీ గేట్
ముఖ్యంగా కరోనాతో యావత్ ప్రపంచం లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో జాన్సన్ గత ఏడాది ఏప్రిల్‌లో తన అధికార నివాసంలో సహచరులతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం తీవ్ర వివాదానికి దారి తీసింది. అదే సమయంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ మరణించారు. దేశమంతా విషాదంలో ఉండగా.. జాన్సన్ ఇలా నిబంధనలకు విరుద్ధంగా పార్టీ చేసుకోవడం దుమారం రేపింది. ఇందుకుగాను పోలీసులు ఆయనకు జరిమానా వేయడంతో పాటు బ్రిటన్ రాణికి జాన్సన్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ‘పార్టీ గేట్’గా సుపరిచితమైన ఈ వ్యవహారంలో పార్లమెంటు ఇంకా విచారణ జరుపుతోంది.
‘పించర్’ ఎఫెక్ట్
ఈ ఏడాది ఫిబ్రవరిలో జాన్సన్ .. క్రిస్ పించర్‌ను ప్రభుత్వ డిప్యూటీ చీఫ్‌విప్‌గా నియమించారు. అప్పటికే ఆయన నడవడికకు సంబంధించి పలు ఆరోపణలున్నాయి. ఆ విషయాన్ని ప్రభుత్వాధికారులు చెప్పినా జాన్సన్ పట్టించుకోకుండా క్రిస్ పించర్‌ను కీలక పదవిలో కూర్చోబెట్టారు. ఇటీవల ఓ క్లబ్‌లో తాగిన మత్తులో క్రిస్ పించర్ ఇద్దరు వ్యక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. అతను ఇలాంటి వాడని తనకు ముందు తెలియదని జాన్సన్ చెప్పడం..పించర్ గురించి తాము ముందే నివేదించామని మాజీ అధికారి ఒకరు మంగళవారం వెల్లడించడంతో వివాదం కీలక మలుపు తిరిగింది. దీంతో బోరిస్ జాన్సన్ తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో పాటు క్షమాపణలు కోరారు. ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో జాన్సన్ పై విశ్వాసం కోల్పోయిన మంత్రులు వరసపెట్టి రాజీనామాలు చేయడం ప్రారంభించారు.దీంతో ఆయన ఎట్టకేలకు ప్రధాని పదవినుంచి తప్పుకోవడానికి అంగీకరించాల్సి వచ్చింది.

Boris Johnson Resigns as UK PM

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News