Saturday, November 23, 2024

సేవకుల తయారీకే బ్రిటిష్ విద్యావిధానం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

సేవకుల తయారీకే బ్రిటిష్ విద్యావిధానం
ఈ అవశేషాలు గతిస్తేనే భవిష్యత్తు
స్పష్టం చేసిన ప్రధాని మోడీ
కొత్త విద్యావిధానంపై మూడురోజుల సదస్సు
వారణాసి: బ్రిటిష్ విద్యావిధానం దేశంలో పలు అవలక్షణాలను అవశేషాలుగా మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. బ్రిటిష్ వారు భారతదేశంపై తమ పెత్తనం సాగించేందుకు వలసపాలకుల లక్షణంతో ఈ మెకాలే విద్యావిధానాన్ని రుద్దారని ప్రధాని విమర్శించారు. ఈ విద్యావ్యవస్థతో దేశంలో కేవలం సేవకుల శ్రేణి ఏర్పడే వాతావరణ నెలకొందని, అప్పట్లో పాలకులకు తమ వద్ద పనిచేసే గుమాస్తాలు, కింది స్థాయి సిబ్బంది అవసరం. అంతకు మించి వారికి ఎటువంటి ఉన్నత ప్రతిభావికాసం కలుగకూడదనే భావనతోనే ఈ బానిసత్వపు పోకడల విద్యా విధానాన్ని తీసుకువచ్చి వెళ్లారని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అయినా ఆ గుర్తుల విద్యావిధానం ఇంకా సజీవంగానే ఉందని, పెద్దగా మార్పులు రాలేదని చెప్పారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) అమలుపై ఇక్కడ జరిగిన ఓ సదస్సును ఉద్ధేశించి ప్రధాని మోడీ గురువారం ప్రసంగించారు. విద్యావ్యవస్థ వల్ల మనిషి భవిష్యత్తు అన్ని విధాలుగా వికాసం చెందాల్సి ఉంటుందని, కేవలం డిగ్రీలు పొందేవారిని ఉత్పత్తి చేసి నిరుద్యోగ మార్కెట్లలోకి పంపించే విధంగా ఉండటం కాదని అన్నారు.

బ్రిటిష్ వారు వారి అవసరాలకు అనుగుణంగా రూపొందించిన విద్యా విధానం దుష్పరిణామాలను ఇప్పటికీ చవిచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థ సమగ్రత అనేది కేవలం దాని ద్వారా దేశ పురోగమననానికి అవసరం అయిన వనరుల సృష్టికి వీలేర్పడటం ద్వారానే స్పష్టం అవుతుందని ప్రధాని తెలిపారు. డిగ్రీలు పొంది, తరువాత సరైన మానవ వనరుల క్రమంలోకి చేరే అవకాశాలు లేకపోవడం వల్ల దేశానికి వ్యక్తులకు మేలు ఏం జరుగుతుందని ప్రశ్నించారు. స్వాతంత్య్ర భారతంలో విద్యావ్యవస్థలో కొన్ని మార్పులు చేపట్టడం జరిగింది. అయితే మార్పు అత్యల్పం, జరగాల్సింది అనల్పంగా ఉందన్నారు. నూతన విద్యావిధానంపై మూడురోజుల సదస్సును కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ యుజిసి, బనారస్ హిందూ యూనివర్శిటీతో కలిసి ఏర్పాటు చేసింది. నేటి పిల్లల సృజన వారి ఆవిష్కరణల పాటవాలకు అనుగుణంగా ఉండే విధంగా విద్యావ్యవస్థలో మార్పులు రావాలని ప్రధాని పిలుపు నిచ్చారు. నేటి విద్యార్థులు ఇతరులను సవాలు చేసే విధంగా గుగూల్ ద్వారా సకల సమాచారం పొందుతున్నారు. ఈ బాలలు విశ్వవిద్యాలయాల స్థాయి వరకూ వచ్చేసరికి వారి ప్రశ్నలకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా సమాధానాలతో కూడిన విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో సంతరించుకోవల్సి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. సదస్సులో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యుపి గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కూడా పాల్గొంటున్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యావిధానం అమలు తీరుతెన్నులు గురించి దేశవ్యాప్తంగా పలు చోట్ల సదస్సులను నిర్వహించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ వీటిని ఏర్పాటు చేస్తోంది.

PM Modi Addressing on NEP in Varanasi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News