Friday, November 22, 2024

భక్తుల బతుకుల్లో వరద సుడులు

- Advertisement -
- Advertisement -

Amarnath death toll rises to 16

16కు చేరిన అమర్‌నాథ్ మృతుల సంఖ్య
చిక్కుపడ్డ 15000 మంది తరలింపు
సైనిక సిబ్బంది అవిశ్రాంత సహాయ చర్యలు
శిథిలాలు కింద పలువురు బందీ

జమ్మూ : అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా తలెత్తిన ఆకస్మిక వరదలలోమృతుల సంఖ్య 16కు చేరింది. వరదల మధ్య చిక్కుపడ్డ వారిలో ఇప్పటికీ 15000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు చోట్ల కొండచరియలు విరిగిపడటం, చెట్లు కూలడంతో శిథిలాల తొలగింపునకు విరామం ఎరుగకుండా సహాయక సిబ్బంది శ్రమిస్తోంది. శిథిలాల కింద పలువురు చిక్కుపడ్డారని భావిస్తున్నారు. దీనితో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. దిగువ బేస్ క్యాంప్ అయిన పంజ్‌తరర్నికి పలువురిని తరలించారు. అక్కడ వారి బసకు ఏర్పాట్లు చేశారని అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మిక వరదలు సంభవించడం అమర్‌నాథ్ యాత్రకు తీవ్ర ఇక్కట్లను తెచ్చిపెట్టింది. పలు టెంట్లు, వంటశాలలు దెబ్బతిన్నాయి. కొండచరియల ధాటికి గురి కావడంతో టెంట్లలోని వారు చనిపోవడం లేదా తీవ్రంగా గాయపడటం జరిగింది. సహాయక పనులకు భారీ స్థాయిలో సైనిక సిబ్బంది రంగంలోకి దిగింది.

ప్రత్యేకంగా పర్వతాలలో చిక్కుపడ్డ వారిని రక్షించే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ప్రాంతంలో సైనిక తనిఖీ బృందాలు కలియతిరుగుతున్నాయి. సహాయక సిబ్బంది అత్యంత అధునాతన హైటెక్ పరిజ్ఞానంతో రంగంలోకి దిగింది. శిథిలాల కింద ప్రజలు ఎవరైనా పడి ఉంటే పసికట్టేందుకు తర్ఫీదు పొందిన శునకాలను కూడా దింపారు. పెద్ద ఎత్తున గాలింపు , సహాయ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రెండేళ్ల విరామం తరువాత ఎంతో ఆసక్తితో అమర్‌నాథ్ యాత్రకు వస్తే ఇటువంటి పరిస్థితి ఎదురయిందని భక్తులు వాపోతున్నారు. క్షతగాత్రులకు వైద్యసాయం అందించేందుకు నీలాగ్రార్ హెలిపాడ్ వద్ద సైనిక వైద్య సిబ్బంది రంగంలోకి దిగింది. దెబ్బతిన్న ప్రాంతంలోకి బిఎస్‌ఎఫ్ వైమానిక విభాగానికి చెందిన ఎంఐ 17 ఛోపర్‌ను రంగంలోకి దింపారు. సహాయక చర్యలకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ అధికార యంత్రాంగం అధునాతన తేలికపాటి హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. ఇక్కడ బిఎస్‌ఎఫ్ చురుగ్గా పనిచేస్తోంది.

ఇప్పటికీ కనుగొన్న మృతదేహాలను బల్టాల్‌కు తరలించినట్లు బిఎస్‌ఎఫ్ అధికార ప్రతినిధి విలేకరులకు తెలిపారు. ఈ ప్రాంతంలో ఐటిబిపి కూడా సేవలను చేపట్టింది. రహదారుల మరమ్మత్తులు, యాత్రికుల భద్రతకు యుద్ధ ప్రాతిపదిక చర్యలకు దోహదం చేస్తోంది. ఈ ప్రాంతంలో సహాయక చర్యలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించేందుకు జమ్మూ కశ్మీర్ పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ విజయ్‌కుమార్ శనివారం ఉదయం పవిత్ర అమర్‌నాథ్ గుహ ప్రాంతానికి చేరారు. జాతీయ విపత్తు నివారణ బృందంతో చర్చించారు. అత్యంత సంక్లిష్టతల అమర్‌నాథ్ యాత్ర జూన్ 30న ఆరంభం అయింది. ఉగ్రవాదుల దాడుల నివారణకు పలు విధాలుగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఊహించని రీతిలో వచ్చిన వరదలతో యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ ప్రాంతంలో వెలిసి ఉన్న బిఎస్‌ఎఫ్ సిబ్బంది తమ శిబిరాలను గాయపడ్డ వారికి చికిత్సల కోసం సిద్ధం చేసి ఉంచారు.

పనికి వచ్చిన రేడియో ఫ్రిక్వెన్సీ కార్డులు

ఈ ముప్పు దశలో చిక్కుపడ్డ వారిని గుర్తించేందుకు వారి ఉనికిని పసికట్టేందుకు , మృతులెందరు ఖచ్చితంగా నిర్థారించుకునేందుకు రేడియో ఫ్రిక్వెన్సీ గుర్తింపు కార్డులు బాగా పనికి వస్తున్నాయి. ఉగ్రవాద దాడుల బెదిరింపుల నేపథ్యంలో ఈసారి అమర్‌నాథ్ యాత్రికులు ప్రతి ఒక్కరికి రేడియో ఫ్రిక్వెన్సీ గుర్తింపు కార్డులు సమకూర్చారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే వారు ఎక్కడున్నది తెలుసుకునేందుకు ఈ కార్డులలోని సంకేతాలతో వీలేర్పడుతుంది. ఇప్యుపడు వరదల దశలో చిక్కుపడ్డ వారిని వీటిసాయంతో తేలిగ్గా గుర్తిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News