విసాల గడవు ముగిసినా తిష్టవేసిన వారిపై నిఘా
తిరిగి వారిని నైజీరియా పంపేందుకు యత్నాలు
హైదరాబాద్: డ్రగ్స్ దందాలో నైజీరియన్‌ల పాత్ర కీలకంగా మారడంతో విసా గడవు ముగిసన నైజీరియన్‌లపై పోలీసులు నిఘా సారిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న వారిలో అత్యధికులు నైజీరియన్లు ఉన్నట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. వీసాల గడువు ముగిసినా హైదరాబాద్‌లో ఉంటున్న నైజీరియన్స్ను వారి దేశాలకు పంపించాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. గడువు తీరినప్పటికీ ఉంటూ నైజీరియన్స్ పలు నేరాలకు పాల్పడుతున్నారని, ముఖ్యంగా డ్రగ్స్ కేసుల్లో వారి పేర్లే అధికంగా వినిపిస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. బంజారాహిల్స్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ జాన్‌పాల్ అరెస్టుతో నగరంలోని నైజీరియన్ల కదలికలపై పోలీసులు ఆరా తీయడంతో పాటు నైజీరియన్లు ఉంటున్న ప్రాంతాలలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రహస్య విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి నేరాలను అరికట్టేందుకు ఇక నుంచి నైజీరియన్స్‌పై కేసులు నమోదు చేయకుండా వారి దేశాలకు అప్పగించాలని హైదరాబాద్ పోలీసుల నిర్ణయించారు. పోలీసు శాఖ గడువు తీరిన నైజీరియన్‌లను గుర్తించి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి వారి దేశాలకు అప్పగించాలని భావిస్తున్నారు.
హైదరాబాద్లో మొత్తం 2500 మంది నైజీరియన్స్ ఉండగా వీరిలో 750 మందికి వీసా గడువు ముగిసినట్లు పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకుని వారిదేశాలకు పంపించడం వల్ల నేరాల సంఖ్యతగ్గే అవకాశం వుందని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో కొకైన్, హెరాయిన్, ఎండిఎంఎ పిల్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలను తరలిస్తూ నైజీరియన్‌లు పెద్ద ఎత్తున పట్టుబడుతున్న విషయం విదితమే. నైజీరియన్లతో పాటు కొందరు ఆఫ్రికన్లు వీసా కాలం ముగిసినప్పటికి నగరంలోనే ఉంటూ గోవా, బెంగళూరు, మహారాష్ట్రల నుంచి మత్తు సరఫరా చేస్తున్నట్లు పోలీసు అధికారుల దర్యాప్తులో తేలింది. నైజీరియన్‌లు బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో వారిని హైదరాబాద్ నుంచి పంపేందుకు పోలీసులు కసరత్తు ప్రారంభించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈక్రమంలో రాష్ట్రంలో డ్రగ్స్, మత్తు పదార్థాల సరఫరా చేస్తున్న నైజీరియన్‌లపై ఎన్డీపిఎస్ 1985 ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపడంతో పాటు వారిని హైదరాబాద్ నుంచి పంపేలా చర్యలు తీసుకోనున్నారు. గడువు ముగిసినప్పటికీ ఇక్కడ డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న నైజీరియన్‌లను తిరిగి వారి దేశాలకు పంపాలని పోలీసు ఉన్నతాధికారులు సరికొత్త వ్యూహాలకు తెరతీస్తుండటం గమనార్హం.