15మంది దుర్మరణం
దక్షిణాఫ్రికాలో రెచ్చిపోయిన గుర్తుతెలియని ముఠా
జోహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలో ఓ దుండగుల ముఠా రెచ్చి పోయింది. ఆదివారంనాడు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇక్కడి సొవెటో టౌన్‌షిప్‌లోని ఓ బార్‌పై తుపాకులతో కాల్పుల మోత మోగించింది. ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ముఠా మినీబస్ ట్యాక్సీలో వచ్చి బార్‌లో ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డట్టు పోలీసులు తెలిపారు. ప్రాణ భయంతో అక్కడున్న వారు పరుగులు తీశారని పేర్కొన్నారు. మొదట 12 మంది మృతదేహాలు లభించాయని, ఆ తర్వాత మరో ముగ్గురు తీవ్ర గాయాల కారణంగా చనిపోయారని చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురు దగ్గర్లోని క్రిస్ హానీ భరగ్వాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
బార్‌లో ఉన్నవారు ఉల్లాసంగా పార్టీ చేసుకుంటుండగా దుండగులు విచక్షణా రహితంగా వారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ ముఠాలో ఎంతమంది ఉన్నారు? ఈ దాడి చేయడానికి ఏమైనా ప్రత్యేక కారణముందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. బార్‌లో సరైన వెలుతురు ఉండదని, దాని కారణంగా కాల్పులు జరిపిన అనుమానితులను కూడా గుర్తించడం కష్టంగా మారుతోందని పోలీసులు తెలిపారు. బార్‌లో ఇద్దరు సాయుధులు తొలుత ప్రవేశించి విక్షచణారహితంగా బుల్లెటల వర్షం కురిపించారని వివరించారు. మృతులు, క్షతగాత్రులంతా 30 నుంచి 45 ఏళ్ల మధ్య వారేనని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు సిబ్బంది అలుపెరగకుండా శ్రమిస్తున్నారని, దోషులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు ప్రకటించారు.