Saturday, September 21, 2024

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని, జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా సోమ, మంగళ, బుధ వారాలు మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. భారీ వానల నేపథ్యంలో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, డ్యాంలు, రిజర్వాయర్లలోని నీటి పరిస్థితి గురించి ఈ సందర్భంగా ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టవలసిన రక్షణ సంబంధిత చర్యల గురించి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, పోలీస్, వైద్య, విద్యా శాఖలు అప్రమత్తంగా ఉంటూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై జనసంచారాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ, ఆర్‌టిసి అధికారులను సిఎం ఆదేశించారు.
ప్రజలతో నేరుగా సంబంధాలుండే అన్ని శాఖలు నిరంతరం పనిచేసే విధంగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సిఎం సూచించారు. భారీ వానల నేపథ్యంలో ఎగువ గోదావరి నుంచి వరద ముంచుకొస్తున్నందు వల్ల ఎస్‌ఆర్‌ఎస్‌పిలో నీరు చేరుతున్న పరిస్థితిని సిఎం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో అధిక వర్షాలు కురుస్తున్నందున ఆ జిల్లాపై ఎక్కువ దృష్టిని సారించి, తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రెస్య్కూ టీంలు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, అవసరమైనచోట హెలికాప్టర్ లను వినియోగించి రక్షణ చర్యలను చేపట్టాలని ఆదేశించారు.

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు
రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ప్రయాణాలు తగ్గించుకోవాలని సిఎం విజ్ఞప్తి చేశారు. ముంపు పరిస్థితులపై ఆరా తీశారు. సెక్రటేరియట్ లో కంట్రోల్ రూంను ఏర్పాటుచేసి, ప్రతి ఆరు గంటలకొకసారి జిల్లా కలెక్టర్లతో, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సిఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ఫోన్ నంబర్లను ప్రజలకు చేరవేసేలా ప్రచారం చేయాలన్నారు. ఏటూరు నాగారం, రామన్న గూడెం ప్రాంతాల వరద ముంపు అధికంగా ఉందని అధికారులు సీఎం కు తెలిపారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం కావాలని సీఎం అన్నారు. రాష్ట్రంలోని వరదముంపు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సిఎస్ కు సూచించారు. వానల నేపథ్యంలో తలెత్తుతున్న పరిస్థితులను వెంటవెంటనే సీఎం కార్యాలయానికి తెలియజేయాలన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో కంట్రోల్ రూంలను ఏర్పాటుచేసి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని టిఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘురామ రెడ్డి సీఎంకు తెలియజేశారు.
జిహెచ్‌ఎంసి పరిసర ప్రాంతాల్లో వరద పరిస్థితులను సిఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ తీగలు తెగిపడటం, పాత గోడలు కూలడం వంటి ప్రమాదాలను పసిగట్టి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నీటి వరద ప్రవాహం ఎక్కువగా ఉండే దారులలో(కాజ్ వేలు) ప్రమాద హెచ్చరిక సూచనలను ఏర్పాటు చేసి ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించే చర్యలను చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్యారేజీలు, పక్క రాష్ట్రాల్లో నిండుతున్న బ్యారేజీల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
అంటువ్యాధులు ప్రబలకుండా జిహెచ్‌ఎంసి మున్సిపల్ అధికారులు చూడాలని సిఎం ఆదేశించారు. వరద ముంపు అధికంగా ఉన్న భూపాలపల్లి, కొత్తగూడెం, నిజమాబాద్ ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ టీంలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. విద్యుత్, తాగునీటికి అంతరాయాలు కలుగుకుండా చూసుకోవాలన్నారు. వానలు ఆగినా తద్వారా వచ్చే వరదలు మరికొన్ని రోజులపాటు కొనసాగుతుందనే దృష్టితో కార్యాచరణ ఉండాలన్నారు. హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లలో వరద పెరిగే అవకాశమున్నందున నీటి విడుదల చర్యలు చేపట్టాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పరిస్థితులు అదుపులోనే అధికారులు సిఎంకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, పి.సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎస్.మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు కె.పి.వివేకానంద, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బేతి సుభాష్ రెడ్డి, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, ఉన్నతాధికారులు సిఎస్ సోమేశ్ కుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎస్. నర్సింగ రావు, సెక్రటరీలు స్మితా సబర్వాల్, వి.శేషాద్రి, రాహూల్ బొజ్జా, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, సిఎం ఒఎస్‌డిలు ప్రియాంక వర్గీస్, శ్రీధర్ రావు దేశ్ పాండే, ఎంఎయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, పిఆర్ అండ్ ఆర్ డి సెక్రటరీ సందీప్ సుల్తానియా, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, పిఆర్ అండ్ ఆర్ డి డైరెక్టర్ ఎం.హన్మంత రావు, పిఆర్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవ రావు, ఎన్ హెచ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, పోలీస్ కమిషనర్లు సివి ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేష్ భగవత్, హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ కె.నాగరత్న పాల్గొన్నారు.

CM KCR Review Meeting on Heavy Rains

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News